అగ్రరాజ్యం అమెరికాలో కీలక తీర్పు వెలువడింది. ఓ భారతీయుడికి అమెరికా కోర్టు ఊహించని శిక్షణ విధించింది. దయ చూపాల్సిన తండ్రి అత్యంత దారుణంగా వ్యవహరించిన ఉదంతంలో జడ్జీలు సైతం అదే రీతిలో కఠినంగా వ్యవహరించారు. మూడేండ్ల వయసున్న కూతురును హత్య చేసిన కేసులో ప్రవాస భారతీయుడు వెస్లీ మాథ్యూస్‌కు (39) అమెరికాలోని టెక్సాస్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత పెరోల్ తీసుకోవడానికి ఆయనకు అవకాశం లభిస్తుందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఈ విధంగా తీర్పు ఇచ్చింది.
అమెరికాలోని టెక్సాస్ లో స్థిరపడిన కేరళకు చెందిన వెస్లీ మాథ్యూస్, సిని దంపతులు 2016లో బీహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న ఓ అనాథాశ్రమం నుంచి షెరిన్ అనే పాపను దత్తత తీసుకున్నారు. అనంతరం ఆమెను తమతో పాటు అమెరికాకు తీసుకువెళ్లారు. అయితే, 2017 అక్టోబర్ 7న షెరిన్ కనిపించడం లేదంటూ వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలు తాగకుండా మారాం చేస్తుండటంతో భయపెట్టేందుకు తెల్లవారుజామున 3 గంటలకు ఇంటిబయట నిలబెట్టి తలుపు వేశానని.. 15 నిమిషాల తర్వాత చూస్తే కనిపించలేదని పోలీసులకు వివరించారు. దీతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. 15 రోజుల గాలింపు అనంతరం ఓ కల్వర్టు కింద కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి మృతదేహం లభించింది.
పోలీసులు తమదైన శైలిలో లోతుగా దర్యాప్తు చేయడంతో తానే షెరిన్‌ను హత్యచేసినట్టు వెస్లీ ఒప్పుకొన్నాడు. పాలు తాగకుండా మారాం చేస్తుండటంతో కొట్టానని, గట్టిగా తగలగడంతో మరణించిందని వెల్లడించాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్వాపరాలను పరిశీలించిన 12 మంది జడ్జీల ధర్మాసనం వెస్లీకి జీవిత ఖైదు విధించింది. కాగా దత్తత తీసుకున్న పాప జవితాన్ని వెస్లి అర్ధాంతంగా నాశనం చేశాడని అనాథాశ్రమం ప్రతినిధులు ఆరోపించారు.