హార్ట్ డ్రగ్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం..?

Suma Kallamadi
ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త సలీం షా వర్జీనియాలో స్థాపించిన సర్ఫెజ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం ఒక సరికొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఐతే తాజాగా ఈ హార్ట్ డ్రగ్‌కు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి ఆమోదం లభించింది. సోన్జ్ఎక్స్ఆర్ (SoanzXR) డ్రగ్ గా పిలవబడే ఈ ఔషధం 2019 సంవత్సరం నుంచి ఎఫ్‌డీఏ అప్రూవల్ కోసం ఎదురు చూసింది. కాగా, ఎట్టకేలకు ఈ డ్రగ్ వినియోగానికి జూన్ 17 వ తేదీన ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది.

లూప్ మూత్రవిసర్జన చికిత్స పొందిన తర్వాత కూడా హార్ట్ ఫెయిల్యూర్ రోగుల శరీరంలోకి.. కాళ్లు, చేతులు ఉదర భాగం లోకి తరచూ నీరు చేరుతుంటుంది. ఐతే ఇటువంటి అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హార్ట్ ఫెయిల్యూర్ కి గురయ్యి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న రోగుల చికిత్సలో కూడా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చు.


ఈ డ్రగ్ రోగగ్రస్తుల శరీరంలో చాలా నెమ్మదిగా.. ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారుచేసిన డ్రగ్స్ అన్నిటికంటే సోన్జ్ఎక్స్ఆర్ ఎక్కువ కాలం పాటు పనిచేస్తూ రోగులకు మెరుగైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఔషధం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా శరీరంలో పెరిగిపోయిన నీరుని బయటికి పంపిస్తుంది. జలోదర వ్యాధి, కాలేయ సిరోసిస్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలను ట్రీట్ చేయడంలో కూడా సోన్జ్ఎక్స్ఆర్ డ్రగ్‌ని వినియోగించవచ్చు.


హార్ట్ ఫెయిల్యూర్ రోగులలో అధిక మూత్రవిసర్జనను తగ్గించడానికి సోన్జ్ఎక్స్ఆర్ ప్రత్యేకంగా రూపొందించబడిందని సలీం షా స్థానిక న్యూస్ మీడియాకు వెల్లడించారు. 65ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసున్న రోగులలో తాము తయారుచేసిన ఔషధం బాగా పనిచేస్తుందని.. ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందని సలీం అన్నారు. తమ ఔషధాన్ని వినియోగించిన తర్వాత ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన వెల్లడించారు.



ఇకపోతే ఇండియన్-అమెరికన్ శాస్త్రవేత్త సలీం ఢిల్లీలోని జెఎన్‌యు నుంచి బయోకెమిస్ట్రీలో పిహెచ్.డి డిగ్రీ పొందారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయిన సలీం డ్రగ్స్ ని అభివృద్ధి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: