భార‌త్‌కు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన భీమ‌వ‌రం అమ్మాయి ' సాయి హ‌ర్షిత అడివి '

VUYYURU SUBHASH
విద్యా రంగంలో భార‌త దేశం గ‌ర్వించేలా 11వ త‌ర‌గ‌తి విద్యార్థిని సాయి హ‌ర్షిత రికార్డు సృష్టించారు. కువైట్‌లోని భార‌త దౌత్య కార్యాల‌యం నిర్వ‌హించిన‌.. వ‌క్తృత్వ పోటీల్లో.. మూడో స్థానంలో నిలిచి అంబాసిడ‌ర్స్ క‌ప్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. కువైట్‌లోని భార‌త దౌత్య కార్యాల‌యం ఆడిటోరియంలో ఈ ఏడాది ఆగ‌స్టు 13న ఇంట‌ర్ స్కూల్ భార‌తీయ విద్యార్థుల‌కు నిర్వ‌హించిన ఈ పోటీలో సాయి హ‌ర్షిత స‌త్తా చాటారు. భార‌త జాతి పిత మ‌హాత్మా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. అక్టోబ‌రు 2న గౌర‌వ‌నీయ భార‌త రాయ‌బారి సి.బి. జార్జ్ ఈ పోటీలో విజేత‌లైన వారికి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

వ‌క్తృత్వ పోటీల్లో మొత్తం 9 అంశాల‌ను విద్యార్తుల‌కు ఇచ్చారు. వీటిలో సాయి హ‌ర్షిత‌.. ``75వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం.. నా తీర్మానం`` అనే అంశాన్ని ఎంచుకుని ఉపన్య‌సించారు. భార‌త్‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డంలో త‌న ఆలోచ‌న‌ల‌ను ఈ తీర్మానంలో ఆమె పేర్కొని.. జ్యూరీ స‌భ్యుల‌ను, ఆడియ‌న్స్‌ను విశేషంగా ఆక‌ర్షించారు. అంతేకాదు.. కొత్త తీర్మానాల కంటే.. కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చేసుకున్న తీర్మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డం, నిజాయితీగా వాటిని చేరుకోవ‌డం అత్యంత ముఖ్య‌మని సాయి హ‌ర్షిత నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయం వెల్ల‌డించారు.
గాంధీ మ‌హాత్ముడు ప్ర‌వ‌చించిన‌.. ఇత‌రుల‌కు సేవ చేయ‌డం, మాన‌వ సేవే మాధ‌వ సేవ‌, స్వ‌చ్ఛ‌త వంటి తీర్మాల‌ను సాయి హ‌ర్షిత నొక్కి చెప్పారు. తాను ఈ తీర్మానాల‌ను సంపూర్ణంగా అమ‌లు చేసేందుకు త‌న‌వంతు ప్రాధాన్యం ఇస్తాన‌ని.. మ‌హాత్ముడికి ఇచ్చే ఘ‌న‌మైన నివాళి ఇదేన‌ని ఉద్ఘాటించారు. `ప‌రిశుభ్ర‌తే.. ప‌ర‌మాత్మ సేవ‌`గా ప్ర‌వ‌చించిన గాంధీ తీర్మానం స‌ర్వోత్కృష్ట‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం-2021 సంద‌ర్భంగా ఈ ఏడాది జూన్‌లో తాను తీర ప్రాంతాన్ని(బీచ్‌) ప‌రిశుభ్రం చేసిన‌ట్టు సాయి హ‌ర్షిత తెలిపారు.

2020 ఫిబ్ర‌వ‌రిలో కువైట్‌లోని రాఫెల్‌ నాద‌ల్ అకాడ‌మీ నిర్వ‌హించిన టెన్నిస్ పోటీల్లోనూ అండ‌ర్ 16 కేట‌గిరీలో గెలుపొందిన వారిలో హ‌ర్షిత ఒక‌రు. ఈ సంద‌ర్భంగా.. టెన్నిస్ లెజెండ్‌, మాస్ట‌ర్ ప్లేయ‌ర్ రాఫెల్ నాద‌ల్ నుంచి ఆమె ట్రోఫీ అందుకున్నారు. 2019లో నిర్వ‌హించిన సాంస్కృతిక పోటీల్లో భ‌ర‌త నాట్యం విభాగంలో అరంగేట్రం చేసిన హ‌ర్షిత అంద‌రినీ మంత్ర ముగ్ధుల‌ను చేశారు. అదేవిధంగా భార‌తీయ క‌ళ‌లైన క‌థ‌క్‌లోనూ ఆమె త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. ప్ర‌స్తుతం.. త‌న హాబీ మేర‌కు కూచిపూడిని నేర్చుకుంటున్నారు. మ‌రో వైపు చ‌దువులోనూ సాయి హ‌ర్షిత చూపుతున్న ప్ర‌తిభ‌కు.. స్కూల్ నుంచి వ‌రుస‌గా ఐదేళ్లుగా స్కాల‌ర్ బ్యాడ్జ్‌ను సొంతం చేసుకుంటున్నారు.
అదేవిధంగా రెండు `గ్రీన్ టైస్‌` సాధించారు. ఇటీవ‌లే విడులైన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో సాయి హ‌ర్షిత‌.. 97.4 శాతం మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. సాయి హ‌ర్షిత‌.. శ్రీ బాల శివ శ్రీకాంత్ అడివి, మోహిని విమ‌ల కిర‌ణ్ దంప‌తుల గారాల ప‌ట్టి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, భీమ‌వ‌రం వీరి సొంత ప్రాంతం. శ్రీబాల శివ శ్రీకాంత్ కువైట్‌లోని ఆయిల్ కంపెనీలో స్పెష‌లిస్ట్(హెచ్ ఎస్ ఈ)గా ప‌నిచేస్తున్నారు. కాగా.. సాయి హ‌ర్షిత విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఆస్వాదిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సాయి హ‌ర్షిత‌ చ‌దువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌, టీచ‌ర్స్‌, స్నేహితులు.. శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. పాఠ‌శాల త‌ర‌ఫున ప్ర‌తి అంశంలోనూ విజ‌యాన్ని సాధిస్తున్న సాయి హ‌ర్షిత భ‌విష్య‌త్తులోనూ మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నారు.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: