ఎన్నారైలకు ద్వంద్వ పౌరసత్వం ఇస్తే..?

Chakravarthi Kalyan
ఖలీస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూకి ద్వంద్వ  పౌరసత్వం ఉంది. అందువల్లే అమెరికా, కెనడా మాకు సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. పన్నూకు మాత్రం ఈ రెండు దేశాల్లో తప్పుడు మార్గాల్లో ద్వంద్వ పౌరసత్వం పొందారు.  ఇలాంటి తప్పుడు మార్గాల్లో కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ద్వంద్వం పౌరసత్వం ఇచ్చే అంశం ఇటీవల చర్చకు వచ్చింది.


దీనిపై ప్రధాని మోదీ కూడా సానుకూలంగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ ఇటీవల ఈ అంశం మరుగున పడింది. అయితే తాజాగా దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు.  భారత పరిశ్రమల సమాఖ్య చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగా ద్వంద్వ పౌరసత్వం అంశంపై మాట్లాడుతూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించడం అనేది సవాళ్లతో కూడిన సమస్య. ఆ సదుపాయాన్ని అందించాలంటే ఆర్థిక, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ ను పరిష్కరించేందుకు ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా అనే అవకాశం ఉన్నా ద్వంద్వ పౌరసత్వంపై చర్చ జరుగుతూనే ఉంది అని విదేశాంగ మంత్రి వివరించారు.


భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సులభతర వ్యాపార అవకాశాలు కల్పించే అంశం, వారికి ద్వంద్వ పౌరసత్వం ఇచ్చే అవకాశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా బదులిచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం నిషేధం. దీనిని మంజూరు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. భారత పౌరుడు అయినప్పుడు అతనికి ఓటేసే హక్కే కాదు. పోటీ చేసే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. ఒకవేళ ఒక వ్యక్తికి ద్వంద్వ పౌరసత్వం ఇస్తే అతను అమెరికాలో స్థిరపడతాడు. అక్కడ నివాసం ఉంటూ వారికి సంతానం కలిగితే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. దీంతోపాటు భారత్ పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అతను వచ్చి మళ్లీ ఇండియాలో పోటీ చేయాలని అనుకుంటాడు. అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తికి భారతదేశంపై ప్రేమ ఉంటుందా అనేది ప్రస్తుత ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

nri

సంబంధిత వార్తలు: