మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై భువనేశ్
కంటి సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ప్రపంచ ప్రఖ్యాత శంకర నేత్రాలయ సహకారంతో గుమ్మడం గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) శిబిరాన్ని నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు జరిగిన ఈ మహత్తర వైద్య సేవా కార్యక్రమంలో 1,048 మందికి అత్యాధునిక కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 140 మందికి శుక్లాల (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగా నిర్వహించి చూపును తిరిగి అందించారు. అంతటితో ఆగకుండా, మరింత క్లిష్టమైన చికిత్స అవసరమైన 160 మంది రోగులను తన స్వంత ఖర్చుతో చెన్నైకి తరలించి అక్కడ శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.
అమెరికాలోని శంకర నేత్రాలయ USA ద్వారా నిధులు సమీకరించి వాటిని స్వగ్రామ ప్రజల ఆరోగ్యానికి వినియోగించడం ఆయన సామాజిక బాధ్యతను చాటుతోంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మడం గ్రామంలో ఉచిత ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. “గ్రామంలో పుట్టిన పిల్లలకు కూడా నగర విద్యార్థుల్లాగే అవకాశాలు ఉండాలి” అనే ఆలోచనతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు.
గుమ్మడం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా..
“మా కళ్లకు వెలుగు ఇచ్చారు... మా పిల్లలకు మంచి విద్యా వాతావరణం కల్పించారు... మా కుటుంబాలకు ఆరోగ్యకరమైన నీటిని అందించారు...” అంటూ గుమ్మడం గ్రామ ప్రజలు భువనేశ్ బూజాల సేవలను కృతజ్ఞతాభావంతో స్మరిస్తున్నారు. అమెరికాలో ఉంటూ కూడా తన పుట్టిన ఊరి అభివృద్ధినే జీవిత ధ్యేయంగా మార్చుకున్న భువనేశ్ బూజాల నేటి తరం ఎన్నారైలకు స్ఫూర్తిదాయక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సేవలతో గుమ్మడం గ్రామం మారుతోంది. జీవితాలు మారుతున్నాయి. భవిష్యత్తులు మారుతున్నాయి. పుట్టిన గడ్డను ప్రేమించడం అంటే మాటల్లో కాదు... చేతల్లో చూపించడం. ఆ ప్రేమకు, ఆ సేవా తపనకు, ఆ మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపమే భువనేశ్ బూజాల.