తల్లి బాటలోనే నడిచిన రేఖ

Prasad
బాలీవుడ్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రేఖ గురించి మనలో చాలా మందికి తెలుసు. గ్లామర్ తారగా రేఖ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అయితే రేఖ తల్లి గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రేఖ తల్లి పుష్పవల్లి కూడా నటిగా మంచి పేరు తెచ్చుకుంది. పుష్పవల్లి గురించి కొన్ని వివరాలు.. నటిగా రాణించిన పుష్పవల్లి అసలు పేరు తాయారమ్మ. తాడేపల్లిగూడెం దగ్గరున్న పెంటపాడు అనే గ్రామంలో 1929లో జన్మించింది. చిన్నతనం నుంచి పాటలు, నటన మీద ఆసక్తి. 12 సంవత్సరాల వయస్సులోనే ఒక సినిమాలో సీత పాత్రలో నటించింది. జె.కె.మంగరాజు రూపొందించిన దశావతారములు ( 1937)లో నుంచి ఆమె పేరు పుష్పవల్లిగా మార్చబడింది. మోహిని భస్మాసుర, వర విక్రయం, చూడామణి, తారాశశాంకం, బాల నాగమ్మ, సత్యభామ.. చిత్రాలతో పుష్పవల్లి ఎంతో పేరు తెచ్చుకుంది. అప్పటి ప్రకటన్లో పుష్పవల్లి ఫోటోను ప్రముఖంగా వేసేవారు. పుష్పవల్లి కళ్లు రెచ్చగొట్టే రీతిలో ఉంటాయని అప్పట్లో సిని పెద్దలు భావించేవారు. గ్లామర్ తారగా పేరు తెచ్చుకున్న పుష్పవల్లి నెల జీతం మీద జెమిని సంస్థలో 18 సంవత్సరాల పాటు పని చేసింది. అప్పుడే జెమిని గణేషన్ తో పరిచయం ఏర్పడి, పుష్పవల్లి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరికి బాబ్జీ, భానురేఖ అనే ఇద్దరు పిల్లలు. వీరు బాలనటులుగా కొన్ని సినిమాల్లో నటించారు. వీరిలో భాను రేఖ తరువాత రేఖగా మారి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా ఎదిగింది. బాలీవుడ్ లో రేఖ పెద్ద స్టార్ అయిన తరువాత పుష్పవల్లి బొంబాయి వెళ్లి పోయారు. తొలితరం గ్లామరస్ నటిగా పేరు తెచ్చుకున్న పుష్పవల్లి 1992లో మృతి చెందారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: