ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ - కాంగ్రెస్ ఒకింత అసహనం




సోమవారం మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. భేటీ అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషా మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరును ఆయన ప్రకటించారు. దీంతో  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసింది. ఈ మేరకుఈ నెల 23న రామ్‌నాథ్ నామినేషన్ దాఖలు చేస్తారు.


ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రేసులో చాలా పేర్లే వినిపించాయి. మురళీ మనోహర్ జోషి, ఎల్.కె. అద్వానీ, సుష్మా స్వరాజ్ పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అద్వానీ పేరును బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేస్తుందని కూడా వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా రామ్‌నాథ్ పేరును ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణన లోనికి తీసుకుని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బాబ్రీ మసీదు కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టడమే మంచిదని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాంటి మచ్చలేని దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.



ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని పరౌంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న రామ్‌నాథ్ కోవింద్ జన్మించారు. దళితులు, వెనకబడిన వర్గాల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో న్యాయవాదిగాను పనిచేశారు. 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేసిన రామ్‌నాథ్ బీజేపీ తరఫున ఉత్తర ప్రదేశ్ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ దళిత మోర్చాకు 1998 నుంచి 2002 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగానూ సేవలందించారు. 2015 ఆగస్టు 8న బీహార్ గవర్నర్‌గా రామ్‌నాథ్ బాధ్యతలు చేపట్టారు.




ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇచ్చేది లేనిది ఇప్పుడే చెప్పబోమని ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. రామ్‌నాథ్‌ అభ్యర్థిత్వంపై తక్షణమే స్పందించబోమని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు.  సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్డీఏ తన అభ్యర్థి పేరును ప్రకటించిన తీరుపై ఒకింత అసహనం వెళ్లగక్కారు


‘రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించడానికి ముందు మమ్మల్ని సంప్రదిస్తామని బీజేపీ చెప్పింది. సోనియా గాంధీతో బీజేపీ త్రిసభ్య కమిటీ భేటీ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ చెప్పినదానికి విరుద్ధంగా, ఏకపక్షంగా పేరును వెల్లడించారు’ అని గులాం నబీ ఆజాద్‌ చెప్పారు.రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలా లేదా అనే దానిపై రెండు రోజుల్లో జరగనున్న సమావేశంలో విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుత బిహార్‌ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత అయిన రామ్‌నాథ్ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. 


రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసిన వెంట‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు ప్ర‌ధాని మోడీ. త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా కోరారు. ప్ర‌ధానే స్వ‌యంగా లైన్లోకి రావ‌టంతో త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు కేసీఆర్‌. పార్టీ నేత‌ల‌తో ఒకసారి చ‌ర్చించి త‌మ నిర్ణ‌యం చెబుతాన‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఆఘ‌మేఘాల మీద పార్టీ ముఖ్య‌ల‌తో చ‌ర్చించి.. వెనువెంట‌నే త‌మ మ‌ద్ద‌తును ఓపెన్ గా చెప్పేశారు కేసీఆర్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: