లండన్ న్యాయస్థానంలో ఈసారి విజయ మాల్యాకు బలమైన ఎదురుదెబ్బ: ఆయన్ను భారత్ కు అప్పగిస్తారా?

దేశ ఆర్ధిక జవసత్వాలు క్షీణింప జేయటంలో భారత రాజకీయనాయకులు ప్రజాప్రతినిధులతో పాటు విజయ మాల్యా లాంటి పారిశ్రామిక వ్యాపారవేత్తలు కార్పోరేట్ దిగ్గజాల పాత్ర అంతింతకాదు. ఒక్క స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాను సుమారు పదివేల కోట్ల రూపాయలకు ముంచి దేశం విడిచి పారిపోయిన విజయ మాల్యా లండన్ లోని పనామా ప్రాంతంలో విలాస వంతమైన జీవితం గడుపుతూ భారత్ పై అవాకులు చవాకులు పేలుతున్నాడు.


బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగవేసి లండన్‌ కు పారిపోయిన ఈయనకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. గ్రేట్ బ్రిటన్‌ లోని ఆస్తులను పూర్తిగా స్తంభింపజేస్తున్నట్లు లండన్‌ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అంతే కాదు ఆయనకు జీవన బృతి కింద రోజు వారీ ఖర్చులకోసం వారానికి 5వేల యూరోలు (సుమారు రూ.4లక్షలు) మాత్రమే ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం పేర్కొంది.


విజయ మాల్యాను భారత్‌కు అప్పగించడంపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో ఈనెల నాలుగో తేదీ నుంచి మూడు రోజుల పాటు కాస్తంత సీరియసుగానే విచారణ జరిగింది. అయితే, ఈ విచారణ మొదలవటానికి ముందు రోజే అంటే డిసెంబరు 3నే ఆయనకు సంబంధించిన ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు మాల్యాకు నోటీసులు పంపించింది.



బ్రిటన్‌లో ఉన్న విజయ మాల్యా ఆస్తులను స్తంభింపజేయాల్సిందిగా భారత్‌ జనవరిలో లండన్‌ న్యాయస్థానాన్ని గతంలోనే కోరింది. విచారణ అనంతరం అందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఇప్పుడు నోటీసులు పంపించారు. భారత్‌ లోని బ్యాంకు లు ఇచ్చిన సమాచారం ప్రకారం మూడు అత్యంత ఖరీదైన ఆస్తులు, కార్లు, ఇతర విలువైన ఆస్తులకు ఆయన యజమాని. మాల్యాకు 11.5మిలియన్ల యూరోల విలువ చేసే "లేడీవాక్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ" ఉన్నట్లు బ్యాంకులు వెల్లడించాయి. దీంతో పాటు 2005లో మాల్యా లండన్‌లో 5.5మిలియన్‌ యూరోల విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేశాడని, రెండు ఓడలు ఉన్నట్లు బ్యాంకులు తెలియజేశాయి.


ఖర్చుల కోసం ఇచ్చే నగదును పెంచాల్సిందిగా విజయ మాల్యా ఆ న్యాయస్థానాన్ని కోరాడు. తనకు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బును 5వేల యూరోల నుంచి 20వేల యూరో లకు పెంచాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాడు. భారత్‌లోని బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసి గత రెండేళ్లుగా విజయ మాల్యా లండన్‌లో దర్జాగా విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌ రప్పించేందుకు భారత ప్రభుత్వ అధికారులు, బాంకుల అధికారులు గ్రేట్ బ్రిటన్ (యూకె)  అధికార బృందంతో పలుదఫాలుగా చర్చలు జరిపారు.


ఈ నేపథ్యంలోనే అతడిని భారత్‌ తిరిగి అప్పగించడంపై లండన్‌ లోని న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుంది. ఈ విచా రణకు విజయమాల్యా హాజరయ్యాడు. ఈ ఏడాది లండన్‌ అధికారులు విజయమాల్యాను రెండుసార్లు అరెస్టు చేసినప్పటికీ, కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: