రేడియో జాకీని లైంగికంగా వేధించిన గజల్ శ్రీనివాస్ అరెస్ట్..!

Vasishta

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్టయ్యారు. రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గజల్ శ్రీనివాస్ ఆలయవాణి పేరుతో వెబ్ రేడియో నిర్వహిస్తున్నారు. అందులో రేడియో జాకీగా పనిచేస్తున్న కుమారి అనే యువతిని గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించినట్టు తెలుస్తోంది. కుమారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.


గాంధేయవాదంపై 125 భాషల్లో పాటలు పాడి 3 గిన్నీస్ రికార్డులు, ఒక లిమ్కా బుక్ రికార్డ్ సాధించిన ఘనత గజల్ శ్రీనివాస్ ది. గాంధేయవాదంపై నీతులు చెప్పి పాటలు పాడిన గజల్ శ్రీనివాస్ ఇప్పుడు లైంగిక ఆరోపణల కేసులో బుక్ అవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన సంస్థలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినే గజల్ శ్రీనివాస్ వేధించడం.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.


గజల్ శ్రీనివాస్ స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు గాంధేయవాదం, మరోవైపు స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ తో పేరు తెచ్చుకున్న గజల్ శ్రీనివాస్ ఇప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ప్రపంచభాషల్లో గాంధేయవాదం, సత్యాగ్రహ సిద్ధాంతాలను ప్రచారం చేసి శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నారు. ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప మిగిలిన అన్ని ఖండాల్లో గజల్ పాటలు పాడారు.


గజల్ శ్రీనివాస్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలను కూడా గజల్ శ్రీనవాస్ చేపడుతున్నారు. నల్గొండ ఫ్లోరోసిస్ బాధిత గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. లాజరస్ ఆసుపత్రికి కల్చరల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న గజల్ శ్రీనివాస్.. శ్రీకాకుళం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను దత్తత తీసుకుని పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు గజల్ శ్రీనివాస్ పై లైంగిక ఆరోపణలు రావడం ఆశ్చర్యం కలిగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: