ఏ పార్టీ అయినా స‌రే... అక్క‌డ ఆమె చెప్పిందే శాస‌నం

Garikapati Rajesh
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే-కాంగ్రెస్ ఒక కూట‌మిగా పోటీచేస్తున్నారు. సీట్ల స‌ర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల మ‌ధ్య ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. అయితే డీఎంకే ఎంపీ క‌నిమొళి చొర‌వ తీసుకొని సీట్ల స‌ర్దుబాటు సాఫీగా కొన‌సాగేలా చూశారు. దీనికి సంబంధించి ఆమె చూపిన చొర‌వ‌, దౌత్య‌నీతిపై సోనియాగాంధీ నుంచి కూడా అభినంద‌న‌లు అందుకున్నారు. క‌రుణానిధి, స్టాలిన్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నార‌ని కొనియాడారు.
కనిమొళి నెరపిన దౌత్యం డీఎంకే - కాంగ్రెస్‌ మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించింది. మూడు విడతలుగా జరిపిన చర్చలు ఫలించకపోవడం, 30 సీట్లడిగితే 18 సీట్లు మాత్రమే ఇస్తామని డీఎంకే అధిష్ఠానం పట్టుద‌ల‌కు పోవ‌డంతో టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి, ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దినేష్‌గుండూరావు పాలుపోని స్థితిలో ప‌డ్డారు. కమల్‌హాసన్‌ తమ కూటమిలో చేరడంటూ కాంగ్రెస్‌ పార్టీకి పిలుపునిచ్చారు.అప్పుడు డీఎంకే ఎంపీ కనిమొళి తెరపైకి వచ్చారు. శనివారం సాయంత్రం స్టాలిన్‌ ఆమెను అర్జెంటుగా చెన్నైకి రావాలంటూ కబురు చేసి పిలిపించారు.
సోనియాగాంధీతో క‌నిమొళి అక్క‌డి ప‌రిస్థితి వివ‌రించారు. కూటమిలోని మిత్రపక్షాల కంటే అధికంగా కనీసం 30 సీట్లయినా ఇచ్చేందుకు అవకాశం ఉందేమో పరిశీలించమని సోనియాగాంధీ క‌నిమొళికి తెలిపారు. కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలంటే కాంగ్రెస్‌కు ఇరవైకి పైగా సీట్లిస్తే సమంజసంగా ఉంటుందని స్టాలిన్‌తో క‌నిమొళి అన్నారు. సోనియాగాంధీకి  ఫోన్‌ చేసి స్టాలిన్‌ను మాట్లాడమని తెలిపారు. ఆ తర్వాత సోనియాతో స్టాలిన్‌ మాట్లాడారు. పావుగంటకు పైగా ఇరువురి మధ్య సంభాషణలు జరిగాయి. సోనియా మాటలు, కనిమొళి హితవచనాలు స్టాలిన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌కు 25 సీట్లు, క‌న్యాకుమారి లోక్‌సభ సీటును ఇచ్చేందుకు స్టాలిన్‌ అంగీకరించారు. కనిమొళి అరగంటపాటు జరిపిన రాయబారం ఎట్టకేలకు ఫలించింది. క‌నిమొళి రాయ‌బారంపై డీఎంకే నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ నుంచి కూడా అభినంద‌న‌లు వెళ్ల‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: