రాజధానికి రాయి పడలేదు కానీ కిరాయి మాత్రం అదిరిపోతోంది
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ, గుంటూరులో అద్దె ఇళ్ల పరిస్థితిని శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించడం గమనార్హం. 'రాజధాని నేపథ్యంలో విజయవాడకు మారితే పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడతాయని, అక్కడ మౌలిక వసతుల్లేవని ఉద్యోగులంటున్నారు. త్వరలోనే ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి సరిపోయిన విధంగా ఇళ్లులేవు' అని వ్యాఖ్యానించారు.
విజయవాడలో అసలే సౌకర్యాలు తక్కువ... చాలా ప్రాంతాల్లో కనీసం బండి పార్కింగుకు కూడా సరైన స్తలం ఉండదు.... గట్టిగా రెండు అడుగుల వెడల్పు కూడా లేని మెట్లున్న ఇళ్లుంటాయి. వన్‌టౌన్, అయోధ్యనగర్, పడమట, కృష్ణలంక ప్రాంతాల్లో ఎటువంటి అధునాతన సౌకర్యాలూ లేకపోయినా రెండు గదులున్న ఇంటికి నెలకు రూ. 5000 నుండి 6000 వరకూ అద్దె డిమాండ్ చేస్తున్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు ప్రాంతాల్లో మూడు గదులున్న ఇల్లు రూ. 8 వేలు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లలో సింగిల్ బెడ్ రూమ్ రూ. 6 నుంచి 7 వేలు, డబుల్ బెడ్‌రూము రూ. 12 నుంచి 14 వేలు, త్రిబుల్ బెడ్ రూమ్‌కు రూ. 15 నుంచి 18 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. కృష్ణలంక ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉంటోంది.