కేసీఆర్‌ Vs ఈటల: రూ. వెయ్యి కోట్లకు చేరిన పందేలు!?

N.Hari
దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ ఉపఎన్నిక హుజురాబాద్‌ అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనన్నట్లుగా ప్రధాన పార్టీల వ్యవహారం కూడా ఉంది. దీనికి తోడు పందేల జోరు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు రూ. 200 కోట్లు వరకు సాగిన పందేలు.. ఇప్పుడు అమాంతంగా రూ. వెయ్యి కోట్లకు చేరినట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్ఎస్‌, బీజేపీ మధ్యే ఉండటంతో.. రెండు పార్టీల్లో గెలుపు ఎవరిదనే దానిపైనే పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఇరుపార్టీలకు చెందిన అభ్యర్థులకు వచ్చే మెజారిటీ, ఆ పార్టీలకు వచ్చే ఓట్లు ఎన్ని? వంటి అంశాల్లో బెట్టింగులు తారస్థాయికి చేరాయి.
హుజురాబాద్‌ ఉపఎన్నికలో గెలుపు ఎవరిది అనే దానిపై నాలుగు రోజుల క్రితం వరకు ఒకవైపుగా ఉన్న బెట్టింగ్‌... ఇప్పుడు ఇరువైపులా కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపోటములపై మొన్నటిదాకా రూ.200 కోట్ల దాకా ఉన్న పందేల జోరు ఇప్పుడు రూ.వెయ్యి కోట్లుకు చేరడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. కాగా బెట్టింగ్‌ దందాలో ఎక్కువగా ఏపీకి చెందినవారే పందెం రాయుళ్లుగా ఉన్నారు. సాధారణంగా ఏపీలోని పందెంరాయుళ్లు బెట్టింగ్‌లు అంటే ముందుంటారనే టాక్‌ ఉంది. అయితే బద్వేలు ఉపఎన్నికలో అధికార వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. అక్కడ బెట్టింగులు కాసినా ప్రయోజనం ఉండదనీ, హుజురాబాద్‌ ఉపఎన్నికపై వారు దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి హుజురాబాద్‌ వరకు ఉన్న హోటళ్లలో తిష్ట వేసుకుని పందేలు కాస్తున్నారని సమాచారం.
మొన్నటి వరకు ఈటల రాజేందర్‌ గెలుస్తారని జోరుగా పందేలు సాగాయి. ఈటలకు 20 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని బెట్టింగులు సాగాయి. అయితే అధికార టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు గెలుస్తాడని కొందరు పందెంరాయుళ్లు వందకు పదింతలు రెట్టింపు డబ్బు ఇస్తామని దందా షురూ చేశారు. దీంతో మిగతా పందెం రాయుళ్లలో ఆశలు రెక్కలు విప్పుకున్నాయి. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆశతో బెట్టింగుల బరిలోకి దిగారు. వందకు పదింతలు కాయ్‌రాజా కాయ్‌ అనడంతో.. వేలు, లక్షలు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఏపీకి చెందిన పందెం రాయుళ్లతో పాటు తెలంగాణకు ఆనుకునే ఉండే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పలువురు వ్యాపారులు బెట్టింగ్‌ దందాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఐపీఎల్‌ను తలపించేలా హుజురాబాద్‌ బైపోల్‌లో బెట్టింగ్‌ దందా అత్యంత గోప్యంగా కొనసాగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: