కంపుకొడుతున్న క్యాంపు రాజకీయాలు.. స్వేచ్ఛగా ఓటేసే హక్కు లేదా..?
ఎన్నికలు సాఫీగా స్వేచ్ఛగా జరగాలి:
ప్రజలే ఓటర్లుగా గల ఎన్నికలు గాని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేసి గెలిపించే శాసనమండలి సభ్యుల ఎన్నికలు గాని ,శాసనసభ్యులు లోక్సభ సభ్యులు ఓటు వేసి గెలిపించే శాసనమండలి రాజ్యసభ సభ్యుల ఎన్నికల వేళ తమ ఎన్నిక కోసం సంబంధిత ఓటర్లను క్యాంపుల్లోకి తీసుకెళ్లి నెలల తరబడిగా పోషించి వారి స్వేచ్ఛను హరించి కోట్లాది రూపాయలను అక్రమంగా ఖర్చు చేసే దుర్నీతికి ముఖ్యంగా అధికార పార్టీలు పాల్పడడంపై ఎన్నికల సంఘం వెంటనే చర్య తీసుకొని క్యాంప్ నిర్వహించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి. అప్పుడు గానీ రాజకీయ నాయకులకు అధికార పార్టీ లకు సోయి రాదు.
క్యాంపు రాజకీయాలు జుగుప్సాకరం:
కరీంనగర్ నుండి స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోబడే శాసనమండలి సభ్యుల ఎన్నిక కోసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారిని తెరాస పార్టీ, సంబంధిత మంత్రి ,రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని గెలుపే ధ్యేయంగా వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ గత 20 రోజులకు పైగా క్యాంపులో నిర్బంధించడం చట్టరీత్యా నేరమే. తెరాస పార్టీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలవచ్చు. కానీ ఎన్నికల సమయంలో వారి అభిప్రాయం మేరకే ఓటు వేయడం అనేది సర్వత్రా జరుగుతూ ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను హరించి వేసే అధికారం ఏ పార్టీకి గాని ప్రభుత్వానికి ముఖ్యంగా అధికార పార్టీకి లేదు. అందులో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్యంగా తమ విధి నిర్వహణకు ప్రజాసేవకు దూరమై ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇలాంటి క్యాంపు రాజకీయాలు నిర్వహించాలంటే ఒక వైపు ఎన్నికల సంఘం తో పాటు మరొక వైపు ఎన్నుకున్న ఓటర్లు ప్రశ్నిస్తే తప్ప ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు క్యాంపు రాజకీయాలకు వెళ్లరు. కంచె చేను మేసినట్లుగా ప్రజలకు సేవ చేయవలసిన ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులను బలవంతంగా క్యాంపులోకి తీసుకెళ్తే ప్రభుత్వం ద్రోహం చేసినట్లు కాదా..?