పాల్వంచ సూసైడ్‌ ఘటనపై సీఎల్పీ సీరియస్‌!

N.Hari
తెలంగాణలో సంచలనంగా మారిన పాల్వంచ సూసైడ్‌ ఘటనపై సీఎల్పీ సమావేశంలో సీరియస్‌గా చర్చ జరిగింది. టీఆర్ఎస్‌ నేత వనమా రాఘవను అరెస్ట్‌ చేయడమే కాకుండా.. ఆయన తండ్రి వనమా వెంకటేశ్వరరావుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని, ఆయన్ను టీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. అధికార టీఆర్ఎస్‌ నేతలు పోలీసులను పార్టీ క్యాడర్‌గా మార్చుకున్నారని, వారి పని వారిని చేయనివ్వడం లేదని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని  మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర గవర్నర్‌, డీజీపీలను కలిసి ఫిర్యాదు చేయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సీఎల్పీ అత్యవసర సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అజెండాలో తొలి అంశంగా వరి ధాన్యం కొనుగోళ్లు, మిర్చి రైతుల సమస్య ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో ఇంకా వరి ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో అన్నదాతలు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తామర తెగులులో తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని, పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతుంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు.
ఇక జీవో 317 వల్ల ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం ఏర్పడిందని సీఎల్పీ విమర్శించింది. 317 జీవోను సవరించాలని పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచితే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, అలాంటి నిర్ణయాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఇదిలావుంటే, సీఎల్పీ సమావేశానికి  సీతక్క, రాజగోపాల్ రెడ్డిలు గైర్హాజరు అయ్యారు. మేడారం ఏర్పాట్లలో ఉన్నందున తాము సీఎల్పీ భేటీకి హాజరుకాలేక పోతున్నామని వారు సమాచారం ఇచ్చారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: