కొత్త నెల్లూరు జిల్లా : దళితులకు ప్రాధాన్యత ఏదీ ?


ఎట్టకేలకూ కొత్త జిల్లాల ముసాయిదాకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అమోదం తెలిపింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పటుకు మార్గం ఏర్పడనుంది. అయితే  నెల్లూరు జిల్లా స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజక వర్గాలుండగా జిల్లాల పునర్ వ్యవస్థీ కరణలో ఆ సంఖ్య ఎనిమిదికి పరిమితంకానుంది.

 పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిపామని పాలకులు జబ్బలు చురుచుకుంటున్నా... ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న జిల్లాలలో ప్రతి జిల్లా లోనూ సామాజిక సమీకరణాల సమతూకం ఉంది. గతంలో నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగినపుడు ఆ సమతూకం పాటించారు. ప్రస్తుతం నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగ లేదు. జిల్లాల పునర్ వ్యవస్తీకరణ మాత్రమే జరిగింది. 2021 జనాభా గణన జరగక పోవడం తో నియోజక వర్గాల పునర్ వ్యవస్తీకరణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

 కొత్త ముసాయిదా ప్రకారం చూస్తే ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో భాగంగా ఉన్న గూడూరు, సూళ్లూరు పేట, వెంకట గిరి  నియోజక వర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్న బాలాజీ జిల్లా పరిధిలోకి వస్తాయి. అదే విదంగా  ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు నెల్లూరులో విలీనం కానుంది. ఈ విషయం అటుంచితే. ప్రస్తుతం నెల్లూరుజిల్లా గూడూరు, సూళ్లూరు పేట నియోజక వర్గాలు ఎస్సీ రిజర్వేషన్ క్రింద ఉన్నాయి. ఈ రెండు నియోజక వర్గాలలో ఎస్సీ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండటంతో వారికి చట్టసభల ప్రధాన్యత లభించేందుకు నాటి పెద్దలు ఈ రెండు నియోజక వర్గాలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించారు. తాజా ముసాయిదా ప్రకారం ఈ రెండు నియోజక వర్గాలూ బాలాజీ జిల్లా పరిధిలో చేరితే. ఇక  నూతన నెల్లూరు జిల్లాలో దళితులకు ప్రాధాన్యత ఉండదు. అసెంబ్లీ నియోజక వర్గా పునర్ వ్యవస్తీకరణ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని అంశం. కేంద్ర ప్రభుత్వం దీనిపై కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ఈ ప్రక్రియ జరిగే అవకాశం లేదు. దీంతో పునర్ వ్యవస్థీకరించిన నెల్లూరు జిల్లా కు సంబంధించిన వరకూ చట్ట సభల్లో దళితులకు ప్రాధాన్యత ఉండదు అనేది స్పష్టమైన విషయం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: