ఇరు తీరాల్లోనూ నిలిచిన నేత మేక‌పాటి

RATNA KISHORE
మ‌ర‌ణ కాల  దుఃఖం చెంత ఇవాళ నెల్లూరు వాసులు ఉండిపోయారు.నెల్లూరు అనే కాదు శ్రీ‌కాకుళం మొదలుకుని అటు తెలంగాణ తీరాల వ‌ర‌కూ ఆయ‌న‌కు ఉన్న స‌న్నిహిత బాంధ‌వ్యాలు అన్నీ ఒక్క‌సారిగా స్మ‌ర‌ణ‌కు వ‌స్తున్నాయి.ఆయ‌నంటే ఇటు ధ‌ర్మాన మొద‌లుకుని అటు శ్రీ‌నివాస్ గౌడ్ వ‌ర‌కూ  అంతా ఓ గౌర‌వ భావానికి, స్నేహిత రూపానికి మాత్ర‌మే ప్ర‌తిక‌గా భావిస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్నా కూడా ద‌ర్పం ఉండ‌దు. మంత్రి హోదాలో ఉన్నా కూడా మిగిలిన వారిలా బ‌డాయి ఉండ‌దు. విదేశాల నుంచి చ‌దువుకుని వ‌చ్చినా కూడా ఆయ‌న న‌డ‌వ‌డి,అణ‌కువ అన్న‌వి ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి.ఆయ‌న ఇత‌రుల‌తో మెలిగే తీరును ప్ర‌తిబింబించే విధంగా ఇవాళ నాయ‌కుల నివాళి మాట‌లు ఉన్నాయి. అవ‌న్న ఆయ‌న వ్య‌క్తిత్వానికి మెచ్చుతున‌క‌లు.
ఇవాళ ఉద‌యం ఏపీ పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తెలుగు రాష్ట్రాల‌లో విషాదం నెల‌కొంది.ఆయ‌న‌కు అటు  ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణ‌లోనూ మంచి స్నేహితులు ఉన్నారు.తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మంచి పేరున్న నేత కావ‌డంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయ‌న బంధం సుదృఢ‌మైంది.ముఖ్యంగా ఆయ‌న వివాదాలకు దూరంగా ఉండే నైజ‌మే ఇంత‌కాలం  ఇంత‌మంది స్నేహితుల‌ను పోగేసుకునేలా చేసి ఉంటుంది.ఆంధ్రా అనేకాదు తెలంగాణ నేత‌ల‌తోనూ ఆయ‌న నెర‌పిన సన్నిహిత బంధాలు కారణంగా కేటీఆర్ మొద‌లుకుని మిగ‌తా  నేత‌లంతా గౌతం రెడ్డికి నివాళులు ఇచ్చి ఆయ‌న‌తో ఉన్న త‌మ బంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.


ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఎంపీ అర్వింద్ కూడా స్పందించారు.కొన్నేళ్లుగా త‌న‌కు ఆ కుటుంబంతో అనుబంధం ఉంద‌ని పేర్కొంటూ వారికి నివాళి ఇస్తున్నారు.ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  నేరుగా జూబ్లిహిల్స్ లో ఉన్నఆయ‌న నివాసానికి చేరుకుని ఆయ‌న పార్థివ దేహానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గా ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చేందుకు క‌డ‌దాకా, అహ‌ర్నిశ‌లూ ప‌నిచేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.వ్యాపారంలో సంపాదించిన డ‌బ్బు ప్ర‌జా సేవ‌కు వెచ్చించార‌ని చెబుతూ, వారి మ‌ర‌ణం త‌న‌నెంతో బాధ పెట్టింద‌ని, అందుకే త‌న సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లు వాయిదా వేసుకున్నాన‌ని అన్నారు. హైద్రాబాద్ లో ఉన్న ఆయ‌న నివాసానికి పార్టీ కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ తో క‌లిసి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: