యూపీలో కాంగ్రెస్ ఓడినా.. ప్రియాంక గెలిచినట్టే..!

Deekshitha Reddy
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ తన బలాన్ని తిరిగి పెంచుకుంటుందనే వార్తలొస్తున్నాయి. రాగా పోగా అధికారం చేజిక్కించుకుంటామని చెప్పిన కాంగ్రెస్ మాత్రం బొక్కబోర్లా పడుతుందని అంటున్నారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ సారాంశం.
మరి కాంగ్రెస్ కోసం అక్కడ అన్నీ తానై వ్యవహరించారు ప్రియాంక గాంధి. పార్టీకి జవసత్వాలు తేవడానికి గట్టిగా కృషి చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఉన్నది ఉన్నట్టుగా నిజమైతే ప్రియాంక కష్టానికి ఫలితం లేనట్టే. కానీ ఓ రకంగా ప్రియాంక గాంధీ అక్కడ తన సత్తా ఏంటో చూపించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తలపండిన రాజకీయ వేత్తలను సైతం ప్రియాంక అయోమయంలో పడేశారని చెబుతారు. పట్టుదలలో నానమ్మ ఇందిరని ప్రియాంక గుర్తు చేసిందని అంటారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కంటే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కష్టమే ఎక్కువ కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, రోడ్‌షో లు, సభలు, సమావేశాలు.. ఇలా ప్రతి విషయంలోనూ యోగి కంటే ఆమె ముందున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఏడు విడతల్లో జరిగిన పోలింగ్‌ లో రిజల్ట్ ఎలా వచ్చినా ప్రియాంక కష్టం మాత్రం అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది.
యూపీలో కాంగ్రెస్‌ బాధ్యతలను పూర్తిగా భుజానికెత్తుకున్న ప్రియాంక గాంధీ దాదాపుగా 45రోజులపాటు ప్రచారం కోసం కష్టపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 209 ర్యాలీలు, రోడ్‌ షోల్లో ఆమె పాల్గొన్నారు. సీఎం యోగి 203 ర్యాలీలు, రోడ్‌ షోలకు హాజరైనట్టు సమాచారం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్‌ 131 ర్యాలీల్లో పాల్గొన్నారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి 18 చోట్ల ర్యాలీలకు మాత్రమే హాజరయ్యారు. ఆ లెక్కన చూసుకుంటే యూపీలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ అత్యథికంగా ప్రచారంలో కష్టపడ్డారని తేలింది. యూపీలో కాంగ్రెస్ ఓడిపోయినా.. ప్రియాంక కష్టం మాత్రం కనపడుతోంది. ఆ కష్టానికి ఎప్పటికైనా ఫలితం వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: