నా తల్లి జయలలిత.. నా తండ్రి శోభన్‌బాబు?

Chakravarthi Kalyan
తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఒకప్పటి టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు మధ్య ప్రేమాయణం ఉందంటూ అనేక వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఎంజీఆర్‌ తో ప్రేమాయణం నడిపిన జయలలిత.. ఆయనతో విబేధాలు వచ్చిన సమయంలో శోభన్ బాబుకు దగ్గరయ్యారని చెప్పుకుంటారు. వారిద్దరు చాలా కాలం తాళి కట్టని భార్యాభర్తల్లా ప్రవర్తించారన్న కథనాలు కూడా ఉన్నాయి. జయలలిత నివాసం నుంచి శోభన్ బాబు బయటకు బయలు దేరుతుంటే.. జయలలిత టాటా చెబుతున్న ఫోటోలు.. జయలలిత ప్రేమగా శోభన్‌ బాబుకు భోజనం వడ్డిస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి.

అయితే.. ఈ వ్యవహారం.. వారిద్దరూ చనిపోయిన తర్వాత కూడా వార్తల్లోకి వస్తోంది. జయలలిత వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినా ఆమెకు వారసులు లేరన్న సంగతి తెలిసిందే. ఆమె అధికారికంగా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఆమెకు సంతానం కూడా అధికారికంగా ఎవరూ లేరు. అయితే.. జయలలిత, శోభన్‌ బాబు సంతానం నేనే అంటూ గతంలో కొందరు వచ్చి నానా హంగామా చేశారు. జయలలిత ఆస్తికి వారసులం మేమే అంటూ మరికొందరు వచ్చారు.. అయితే.. ఇవేమీ ఆధారాలు చూపలేకపోయారు.

తాజాగా ఇప్పుడు మరో మహిళ కూడా అలాగే మీడియా ముందుక వచ్చింది. నా తల్లిదండ్రులు జయలలిత, శోభన్‌బాబుఅని.. వారి వారసురాలిని నేనే అని అంటోంది. జయలలిత వారసురాలిగా తనకు వారసత్వ ధృవీకరణ పత్రం అందించాలని మదురైలో ఓ మహిళ అధికారులతో గొడవకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. మదురై తిరువళ్లువర్‌ నగర్‌కు చెందిన మురుగేశన్‌ భార్య మీనాక్షి  ఇలా గొడవ చేస్తోంది. ఆమె.. తన తండ్రి శోభన్‌బాబు, తల్లి జయలలిత అని వాదిస్తోంది. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న తన తల్లి చనిపోయినందున తనకు వారసత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాలంటోంది.

ఈ మేరకు ఆమె జనవరి 27న ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కూడా పెట్టింది. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్లికేషన్ పెట్టి నెలరోజులైనా తనకు సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరని మీనాక్షి ఏకంగా తాలూకా కార్యాలయానికి వచ్చి అధికారులతో గొడవకు దిగడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: