అమరావతి : బీజేపీకి కన్నా షాకివ్వబోతున్నారా ?

Vijaya





విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఎపిసోడ్ తర్వాత బీజేపీలో అనూహ్య పరిణామాలు జరిగిపోతున్నాయి. రాష్ట్రపార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత చీఫ్ సోమువీర్రాజుపై విరుచుకుపడ్డారు. వీర్రాజు ఫెయిలైన కారణంగానే జనసేన అదినేత బీజేపీపై వ్యాఖ్యలు చేశారన్నారు. అందరినీ కలుపుకునిపోవటంలో వీర్రాజు అట్టర్ ఫ్లాప్ అయినట్లు కుండబద్దలు కొట్టారు. తాను ప్రభుత్వంపై పోరాటాలు చేయాలంటే బీజేపీ అగ్రనేతలు రోడ్డుమ్యాప్ ఇవ్వలేదని, రాష్ట్ర నేతలు సహకరించలేదని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.



పవన్ వ్యాఖ్యల నేపధ్యంలోనే వీర్రాజును కన్నా తీవ్రంగా తప్పుపట్టారు. తమతో ఏ విషయాలు కూడా మాట్లాడటంలేదని ధ్వజమెత్తారు. వీర్రాజు ఫెయిల్యూర్ ఫలితమే తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలంటు మీడియాతో బహిరంగంగా మాట్లాడటమే ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. ఇదంతా కన్నా ఎందుకు మాట్లాడారనే విషయమై పార్టీ ఆరాలు తీస్తోంది. అయితే తొందరలోనే కన్నా బీజేపీని వదిలేస్తారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.



చాలాకాలంగా కన్నా పార్టీలో అసంతృప్తిగానే ఉన్నారు. అధ్యక్షుడిగా దిగిపోయిన దగ్గర నుండి కన్నాను ఎవరు పట్టించుకోవటంలేదు. ఇదే సమయంలో పార్టీ బలోపేతం కావటం జరిగేపనికాదని అందరికీ తెలుసు. అయినా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామేనంటు ఒకటే ఊదరగొడుతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పెట్టుకునేంత సీన్ లేని పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కానీ వీర్రాజు లాంటివాళ్ళు జనాల చెవుల్లో పువ్వులు పెట్టేస్తున్నారు.



ఈ నేపధ్యంలోనే కన్నా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. కన్నా చూపు టీడీపీ వైపుందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీగాను, కొడుక్కి ఎంఎల్ఏ టికెట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. వీర్రాజుపై బహిరంగంగా వ్యాఖ్యలుచేసిన దగ్గర నుండి తన మద్దతుదారులతో సమావేశం జరుపుతున్నారు. వైసీపీలో వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. కాబట్టి టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయమని అనుకోవాలి. కాబట్టి తొందరలోనే కన్నా వికెట్ పడిపోవటం ఖాయమనే అనుకోవాలి. కాకపోతే కన్నా బాటలో ఇంకా ఎంతముందున్నారనే విషయమై  ఇపుడు చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: