నీరు, టీ, నిమ్మరసం... అమెరికా పర్యటనలో మోడీ మెనూ!

Chowdary Sirisha
అమెరికా పర్యటనలో భాగంగా మోడీ మెనూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. సరిగ్గా అమెరికా పర్యటన సమయంలోనే ఆయన నవరాత్రి ఉపవాస దీక్షలు చేపడుతున్న నేపథ్యంలో మోడీ మెనూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో మోడీ, కేవలం ద్రవాహారానికే పరిమితం కానున్నారు. ద్రవాహారంలోనూ మంచి నీళ్లు, టీ, నిమ్మరసాలు మినహా మిగిలినవేవీ కనిపించవు. తమ దేశ పర్యటనకు వస్తున్న మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విందు ఏర్పాటు చేశారు. అంతేకాక పలువురు పారిశ్రామిక రంగ దిగ్గజాలు, ప్రవాస భారతీయులు కూడా మోడీకి విందు ఏర్పాటు చేసే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. మోడీ ఉపవాస దీక్షలతో వారంతా ఒకింత నిరుత్సాహానికి గురికాక తప్పదు. రోజూ ఓ కప్పు టీతో పాటు కాసింత తేనె వేసిన నిమ్మరసాన్ని మాత్రమే మోడీ తీసుకుంటారని స్వయంగా ఆయన కార్యాలయం వెల్లడించింది.  రోజూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచే మోడీ, ధ్యానం, పూజల తర్వాత నిమ్మరసం తీసుకుంటారని 12 ఏళ్లుగా మోడీతో సన్నిహితంగా ఉంటున్న ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 13 ఏళ్ల కాలంలో తన నవరాత్రి ఉపవాస దీక్షల సందర్భంగా కాలు బయటపెట్టని మోడీ, దీక్షలో ఉండగా తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. నవరాత్రి ఉపవాస దీక్షలు మొదలుపెట్టే 25వ తేదీ సాయంత్రమే మోడీ అమెరికా బయలుదేరనున్నారు. 63 ఏళ్ల వయసున్న మోడీ, ఉపవాస దీక్షలో భాగంగా కొన్ని ఫలాలతో పాటు ఫలరసాలను తీసుకోవాలన్న వైద్యుల సలహాలను తిరస్కరించారు. నవరాత్రి ఉపవాస దీక్షల సందర్భంగా మెజార్టీ భక్తులు ప్రతి రోజు దీక్ష ముగిసే సమయంలో ఒక్క పూట భోజనం చేస్తారు. మోడీ లాంటి వారు మాత్రం ఘనాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: