ఈ కబురు వింటే ఆంధ్రా అసూయపడాల్సిందే..

                                                తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ప్రతి విషయాన్ని పోల్చి చూసుకోవడం ఓ అలవాటుగా మారింది. నగరాల నుంచి దేవుళ్ల వరకూ మాకు అది ఉంది.. మీకు ఇది ఉంది.. అని లెక్కలేసుకోవడమూ అక్కడక్కడా చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకూ తెలుగు ప్రజల రాజధానిగా వెలుగొందిన భాగ్యనగరం ఇప్పుడు తెలంగాణ సొత్తయింది. హైదరాబాద్ కు అందం తెచ్చింది నేనే.. అంతకు మించిన నగరాన్ని ఏపీలో కడతానంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..                                          ఈ నేపథ్యంలో.. ఓ అంతర్జాతీయ ట్రావెలర్ మ్యాగజైన్ భాగ్యనగరానికి ఓ అరుదైన కితాబిచ్చింది. ప్రపంచంలోనే చూసి తీరాల్సిన రెండో నగరం గా హైదరాబాద్ ను ప్రకటించింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తర్వాత ప్రపంచంలో చూడదగిన రెండో ప్రాంతంగా హైదరాబాద్ ను గుర్తించింది. ఈ ట్రావెలర్ మేగజైన్.. నేషనల్ జియోగ్రాఫిక్ కు చెందింది కావడం విశేషం. మొత్తం ప్రపంచంలోని అత్యుత్తుమ చూడదగిన ప్రదేశాలుగా టాప్ 20 జాబితాను రూపొందించింది.                                                 ఈ మ్యాగజైన్ హైదరాబాద్ ఎందుకు రెండో చూడతగిన ప్రాంతమో తన నివేదికలో వివరించింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఉస్మాన్ అలీ ఖాన్ ఈ నగరంలోనే జీవించారని తెలిపింది. ఆయన హైదరాబాద్ ను పాలించిన చివరి నిజాం అని తెలిపింది. హైదరాబాద్ కు కవితాత్మక చరిత్ర ఉందన్న నివేదిక.. ఇది ఒకప్పటి రాచనగరని గుర్తు చేసింది. అలాంటి హైదరాబాద్ ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిందని వివరించింది.                                    ఇంకా.. ఫలక్ నుమా ప్యాలస్, ఇరానీ కేఫ్ లు, ముత్యాల వర్తకులు.. ఇలా ఎన్నోఆకర్షణలున్నాయని తన నివేదికలో చెప్పింది. పై వివరాలన్నీ నిజమే అయినా.. హైదరాబాద్ కు ఐటీ కల్చర్ తెచ్చింది మాత్రం ఏపీ సీఎం చంద్రబాబే అన్న విషయాన్ని అంతా ఒప్పుకుంటారు. మరి అలాంటి బాబు... ఏపీ కొత్తరాజధానిని ఎలా నిర్మిస్తారోనన్నిది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: