ఉక్రోషంతోనే ఏబీఎన్ రాధాకృష్ణ ఆ పని మొదలెట్టారా..!?

Chakravarthi Kalyan
వేమూరి రాధాకృష్ణ.. తెలుగు జర్నలిజంలో ఈయనదో ప్రత్యేక అధ్యాయం. పాత్రికేయుడుగా జీవితం మొదలుపెట్టి పత్రికాధిపతిగా మారిన అతి కొద్దిమందిలో ఈయన ఒకరు. నష్టాలతో మూతబడిన ఆంధ్రజ్యోతి పత్రికను సొంతం చేసుకుని మళ్లీ తెరిపించి విజయవంతంగా నడిపిస్తున్న పాత్రికేయుడు. అంతేకాదు.. తెలుగు నాట దమ్మున్న ఛానల్ గా ఏబీఎన్ ని తీర్చిదిద్దిన రథసారధి. 

ఓ ఎండీగా అటు ఆంధ్రజ్యోతి పత్రికను, ఇటు ఏబీఎన్ ఛానల్ ను నడిపిస్తూ కూడా ఆయన తన సొంత పత్రికలో ఓ కాలమ్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణ అందిస్తున్నారు. అయితే ఓ జర్నలిస్టుగా అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే.. కానీ ఆ కొత్త పలుకు శీర్షిక ప్రారంభం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. 

మొదట్లో ఆంధ్రజ్యోతిలో అదే స్థానంలో ఉలుకు-పలుకు పేరుతో దిగ్గజ పాత్రికేయులు ఐ వెంకట్రావు కాలమ్ రాసేవారు. పాత ఆంధ్రజ్యోతి కాలం నుంచి కూడా ఐ వెంకట్రావు విశ్లేషణాత్మక వ్యాసం చాలా ఫేమస్. చాలామంది రాజకీయనాయకులు కూడా దాన్ని ఆసక్తిగా చదివేవారు. కొత్త ఆంధ్రజ్యోతి పెట్టాక కూడా చాలాకాలం ఆ శీర్షికను ఐ వెంకట్రావు నిర్వహించారు. 

ఐతే.. ఓసారి ఉన్నట్టుంది ఐ వెంకట్రావు ఆ శీర్షిక తాను రాయలేనని చెప్పేశారు. గురు సమానులైన ఐ వెంకట్రావును రాధాకృష్ణా చాలా బతిమాలారట ఏదో రకంగా వీలు చూసుకుని రాయండి.. అని సర్ది చెప్పినా ఐ వెంకట్రావు కుదరదన్నారట. దాంతో రాధాకృష్ణలో ఉక్రోషం పెల్లుబికింది. ఏం ఆయనే రాయాలా.. ఆయన రాయకపోతే శీర్షిక ఆగిపోతుందా.. అన్న ఆవేశంతో తానే రాయడం మొదలుపెట్టారట. అలా ఉలుకూ పలుకూ స్థానంలో కొత్త పలుకు వచ్చి చేరింది. ఇటీవల ఆ కొత్త పలుకు సంపాదకీయాల సంకలనం వెలువడిన సందర్భంగా ఈ ఫ్లాష్ బ్యాక్ రాధాకృష్ణే బయటపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: