రాంగ్ ట్రీట్ మెంట్ వల్లే శ్రీహరి చనిపోయారా..!?
నటుడు శ్రీహరి అనారోగ్యంతో కన్నుమూసి రెండేళ్లు దాటి పోయింది. వరుస సినిమాలు చేస్తూనే అకస్మాత్తుగా ఆయన మృత్యువాతపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. నటుడు మోహన్ బాబు తర్వాత ఆ స్థాయిలో హీరోగా, విలన్ గా, కమేడియన్ గా.. అన్నిరకాల పాత్రల్లో అలరించిన నటుడాయన. ఆయన మరణం గురించిన కొన్ని చేదువాస్తవాలను ఆయన భార్య శాంతి ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
శ్రీహరికి ప్రాణాపాయం ఉన్నంత అనారోగ్యం లేదని శాంతి చెప్పారు. మొదట్లో జాండిస్ ఉందని.. అది తగ్గుముఖం పట్టిందని.. ఆ పై జ్వరం రావడం వల్ల తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారని ఆమె ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అయితే చనిపోయేంత అనారోగ్యం లేదని సదరు ఆసుపత్రిలో జరిగిన రాంగ్ ట్రీట్ మెంట్ వల్లనే శ్రీహరి మరణించారంటూ ఆమె కొత్త విషయాలు వివరించారు.
ముంబైలో షూటింగ్ లో ఉంటూ జబ్బుపడిన శ్రీహరిని అక్కడి లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ట్రీట్ మెంట్ లో జరిగిన లోపాల వల్లే శ్రీహరి హఠాన్మరణం చెందారని శాంతి అంటున్నారు. ట్రీట్ మెంట్ విషయంలో ఇప్పటికీ తాము తప్పు జరిగిందనే నమ్ముతున్నానన్నారు. వందశాతం రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారన్నారు. డాక్టర్లపై కేసు వేయమని కొందరు తనకు చెప్పారని.. కానీ న్యాయం జరుగుతుందని నమ్మకం లేకనే పోరాడలేదని శాంతి చెప్పారు.
రాంగ్ ట్రీట్ మెంట్ తో శ్రీహరి ముక్కులు, నోట్లో నుంచి బ్లడ్ వచ్చిందని.. మంచం మొత్తం బ్లడ్ అయ్యిందని.. ఏడుస్తున్నానని తనను దూరంగా ఉంచారని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు శాంతి. తనను డాక్టర్లు బ్లాక్మెయిల్ చేశారని వివరించారు. తమ ఫ్యామిలీకి క్లోజ్ అయిన ఓ మంత్రిగారి కొడుక్కు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పారు. ఇద్దరు పిల్లలను పెట్టుకుని తాను కోర్టుల చుట్టూ తిరగలేకనే ఆ ఆసుపత్రిపై పోరాడలేదని శాంతి వివరించారు.