ఆంధ్రాలో మరోసారి సర్కారు వర్సెస్ మీడియా వార్ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అంతులేని అవినీతికి ప్రోత్సాహం అందిస్తున్నారంటూ సాక్షి పత్రిక ప్రచురించిన వార్త కలకలం సృష్టించింది. ఏపీ సర్కారు పాలనలోని అవినీతికి చంద్రబాబే బిగ్ బాస్ అంటూ సాక్షి పత్రిక ఓ పెద్ద కథనం వండి వార్చింది. అధికార పార్టీ ఎంపీలే అవినీతిని బయటపెడుతున్నారని సీఎం సురేశ్ లేఖను ప్రస్తావించింది.
ఇటీవల ఏపీ వివాదాస్పదం అయిన అన్ని అంశాలను గుదిగుచ్చి ఓ కథనంగా మలచింది. అన్నిరంగాల్లో సాక్ష్యాలతో అవినీతి సహా బైటపడుతున్నా చంద్రబాబు మౌనముద్ర వహిస్తున్నారని ఏకేసింది. ఇసుక లాబీ ద్వారా చినబాబు లోకేశ్ దందాలు సాగిస్తున్నారని విమర్శించింది. పాజెక్టు పనుల్లో ఏరులుగా పారుతున్న అవినీతికి పట్టిసీమ మొదలు అవుకు వరకూ ఎన్నో ఉదాహరణలున్నాయని రాసింది.
టీడీపీ నేతలు అధికారులపై దాడులకూ తెగబడుతున్నారని వివరించింది. అయినవారికి వందల ఎకరాల భూములు కట్టెబెడుతున్నారని ఉదహారణగా బామ్మర్ది, ఆయన వియ్యంకుల కోసం విడుదల చేసిన జీవోలను ప్రస్తావించింది. ఇసుకపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సమయంలో సాక్షి కథనం ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు సాక్షి తీరుపై ఫుల్ ఫైర్ అయ్యారు.
అవినీతి సొమ్ముతో పెట్టిన పత్రిక గురించి తాను మాట్లాడటం అనవసరం అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో సొంతంగా పత్రిక పెట్టుకుని రాజకీయం చేస్తున్న పార్టీలు లేవని వైసీపీని కడిగిపారేశారు. చేతిలో పత్రిక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల ఆ పత్రిక విశ్వసనీయత పడిపోవడం తప్ప తమకు వచ్చిన నష్టమేమీ లేదని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.