కోదండరామ్.. చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపించినా ఈ పంతులు గారు తెలంగాణ ఉద్యమంలో పోషించిన క్రియాశీలక పాత్ర అంతా ఇంతా కాదు.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత అంతటి కీలక భూమిక ఈయనదే అని చెబితే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒక దశలో కేసీఆర్ కాడీ మేడీ కిందపారేసినట్టు కనిపించినా.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సకలజనుల్లో నింపడంలో కోదండరామ్ కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
అలాంటి వ్యక్తి తెలంగాణ ఏర్పడిన తర్వాత సహజంగానే అప్రాధాన్య వ్యక్తిగా మారిపోయాడు. ఆయన అలా మారాడు అనడం కంటే.. అలాగే ఉండాలని కోరుకున్నాడు అనడం కరెక్ట్. ఆయన కావాలనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు. టీఆర్ ఎస్ లో చేరి ఉండొచ్చు. కానీ ఆయన మాస్టారుగానే ఉండదలచుకున్నారు. ప్రజల పక్షం పోరాడే అవకాశాన్ని ఎప్పుడూ తన వద్దే ఉంచుకోదలిచారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కోదండరామ్ ను కేసీఆర్ పట్టించుకోలేదని.. కావాలనే పక్కనపెట్టారని.. తనకు పోటీ అవుతారని భావించారని.. ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తెలంగాణ సీఎం అయ్యాక కేసీఆర్, కోదండరామ్ ప్రత్యేకంగా ఎక్కడా కలుసుకోకపోవడం కూడా ఈ కథనాలకు కారణం కావచ్చు. అయినా కోదండరామ్ తన పని తాను చేసుకుపోతున్నారు.
ప్రజాసమస్యలపై నిక్కచ్చిగా తన అభిప్రాయం చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో సర్కారుకు వ్యతిరేకంగా కోర్టులో వాదన వినిపించగలిగారు. దాని ఫలితంగానే ఇప్పుడు రైతు సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. కోదండరామ్ పిటీషన్ కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 30న సచివాలయం డి బ్లాక్లో.. రైతు సమస్యలపై అవగాహన ఉన్నవారితో సమావేశం నిర్వహించనుంది.
రైతు ఆత్మహత్యలపై హైకోర్టును ఆశ్రయించిన కోదండరామ్ తో పాటు వివిధ సంఘాల నేతలు ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశానికి సర్కారు తరపున కేసీఆర్ హాజరైతే.. ఆయన కోదండరామ్ తో ముఖాముఖి చర్చించే అవకాశం వస్తుంది. మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.