తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్రా సీఎం బావమరిది, హిందూపూర్ ఎమ్మెల్యే కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి మరీ బాలకృష్ణ కేసీఆర్ తో భేటీ అయ్యారు. నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్టు ఛైర్మన్ అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఈ క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల గురించి చర్చించినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు.
అంతేకాదు.. వారిద్దరూ కొద్దిసేపు సినిమా ముచ్చట్లు కూడా చెప్పుకున్నట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ త్వరలోనే సినీరంగ ప్రవేశం చేస్తున్నాడని బాలయ్య చెబితే.. మీ వందో సినిమా ఎప్పుడు మొదలవుతుందని కేసీఆర్ అడిగారట. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూసేవాడినని కేసీఆర్ చెప్పారట. డిక్టేటర్ సినిమా చూడమని బాలయ్య కేసీఆర్ ను కోరారట.
ఇదంతా మీడియాకు లీకైన సమాచారం. కానీ అసలు విషయం వేరే ఉందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. క్యాన్స్రర్ ఆసుపత్రి నిర్మాణాల్లో కొన్నింటికి అవసరమైన అనుమతులు లేవని వాటిని రెగ్యులరైజ్ చేయమని బాలయ్య కోరారట. అంతేకాదు.. బావ చంద్రబాబే బాలకృష్ణను కేసీఆర్ వద్దకు రాయబారం పంపినట్టు కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని లోపాయకారీ వ్యవహారాలు కూడా బాలయ్య ద్వారా చంద్రబాబు చక్కబెట్టేప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ- బీజేపీ కూటమి కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సమయంలో ఈ రెండు పార్టీలు కొన్ని స్థానాల విషయంలో ఓ అవగాహనకు వచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చని తెలుస్తోంది. ఐతే.. ముక్కుసూటి బాలయ్య.. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టగలరా.. అనుమానమే..!?