ఆంధ్రాలో యమ టెన్షన్ పుట్టిస్తున్న పోస్టల్ ఓట్లు..

Chakravarthi Kalyan
పోస్టల్ ఓట్లు.. సాధారణ పరిస్థితుల్లో ఓటు వేయలేని ఓటరు కోసం ప్రత్యేకంగా కల్పించే సౌకర్యమే ఈ పోస్టల్ ఓట్లు. సాధారణంగా ఈ పోస్టల్ ఓట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. జనరల్ ఎలక్షన్లలో ముందుగా ఈ పోస్టల్ ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాల ఓట్ల తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. 

వీరు పోలింగ్ రోజు కాకుండా.. ఆ తర్వాత ప్రత్యేకంగా ఓట్లు వేస్తారు. మొన్న జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ సంఘ్, ఎంప్లాయిస్ యూనియన్ రెండూ పోటాపోటీగా ఓట్లు తెచ్చుకోవడంతో ఇప్పుడు ఈ పోస్టల్ ఓట్లే కీలకం కానున్నాయి. ఆర్టీసీ సంస్థలో గుర్తింపు సంఘం హోదా కోసం ఈనెల 18వ తేదిన ఎన్నికలు జరిగాయి. మొత్తం 56 వేల 437 మంది ఓటర్లు ఉండగా.. 55వేల 35 ఓట్లు పోలయ్యాయి. 

అందులో 172ఓట్లు చెల్లలేదు. మిగతా 54వేల 863 ఓట్లలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కు అత్యధికంగా 24వేల 708 ఓట్లు వచ్చాయి. ఎంప్లాయిస్ యూనియన్ 24వేల 156ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఎంప్లాయిస్ యూనియన్ కంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ ... కేవలం 552ఓట్లు ఆధికంగా సాధించింది. దీని ప్రకారం ఎన్.ఎం.యు కు గుర్తింపు హోదా రావాల్సి ఉంది. 

ఎన్నికల రోజు విధుల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వెయ్యి మందికి పైగా కార్మికుల కోసం ఈనెల 23, 24 తేదీల్లో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ల సేకరణ, లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఓట్ల కంటే ఈ పోస్టల్ ఓట్లే కీలకం కానున్నాయి. 

అందుకే ఇప్పుడు ఆ వెయ్యి మంది ఓట్ల కోసం ప్రముఖ యూనియన్లు గాలాలు వేస్తున్నాయి. ఆ కార్మికులకు తాయిలాలు అందించి తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. మరి తుది ఫలితం ఎవరిని వరిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: