మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలం కడ్తాల్ లో నిర్వహించిన ప్రపంచ మహా ధ్యాన సభల పేరుతో సుభాష్ పత్రీ దారుణాలకు పాల్పడుతున్నాడంటూ రెండు రోజులగా మీడియా కథనాలు వస్తున్నాయి. సుభాష్ పత్రీ ధ్యానం ముసుగులో తన దగ్గరకు వచ్చే మహిళలతో లైగింక వాంఛలు తీర్చుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కడ్తాల్ లోని ధ్యాన పిరమిడ్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా కూడా పెద్ద ఎత్తున సాగుతోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
దీంతో స్థానికులు కడ్తాల్‌లోని మహాపిరమిడ్ వద్ద ఆందోళనకు దిగారు. ధ్యాన పిరమిడ్ పేరుతో తమ భూములు లాక్కున్నారని వారు ఆరోపించారు. భూములు వెనక్కి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. అక్కడ కవరేజీకి వెళ్లిన మీడియాపై పత్రీజీ అనుచరులు దాడికి దిగారు. ఈ దాడిలో ఓ చానల్ రిపోర్టర్, కెమెరామెన్, టెక్నీషియన్లతోపాటు... వాహనం అద్దాలు ధ్వంసం చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మీడియా ప్రతినిధులపై పత్రీజీ అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుకోవాలంటూ జర్నలిస్టు సంఘాల నేతలు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి జర్నలిస్టుల సమక్షంలోనే మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. జరిగిన సంఘటపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు పత్రీ శిష్యులు మాత్రం ఇదంతా తమ గురువుపై తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ప్రపంచ ధ్యాన మహాసభలు విజయవంతమయ్యాయని, వీటి స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. మహిళలు, యువతులను ముద్దాడటాన్ని పత్రీ మరో శిష్యుడు ప్రేమ్‌రాజ్ బాబా సమర్థించుకున్నారు. ముద్దులతో ప్రేమ తత్వాన్ని పంచుతున్నట్లు చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: