రాష్ట్రంలో విభజన వేడి!

Priyanka Reddy
  తెలంగాణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సమావేశం జరగనుంది. మరోవైపు సచివాలయంలో బుధవారం సీనియర్ మంత్రి జనారెడ్డి చాంబర్ లో మంత్రులు పొన్నాల, శ్రీధర్ బాబు, సారయ్య, ప్రసాద్ కుమార్ సమావేశమయ్యారు. సుమారు గంటపాటు చర్చించారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జానా అన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, జేఏసీ నేతలను సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... వారి ట్రాప్ లో పడవద్దని జానారెడ్డి హితవు పలికారు. సీమాంధ్ర నేతలు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి సమస్యను జటిలం చేయాలనే హైదరాబాద్ లో సమావేశం పెట్టాలని చూస్తున్నారని జానారెడ్డి అన్నారు. 60 ఏళ్లైనా జానారెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అటు ఢిల్లీలో ఉన్న టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా సీమాంధ్ర నేతలపై ఎదురుదాడి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఆజాద్, వయలార్ రవితో కలసి విజ్ఞప్తి చేశారు. అధిష్టానం ప్రకటన అంటూ చేస్తే అది ఇరు ప్రాంతాలకు ఆమోద యోగ్యంగా ఉండాలని సీమాంధ్ర నేతలు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం సీమాంధ్ర నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అధిష్టానం తెలంగాణా ఇస్తుందన్న భయంతోనే తాము ఢిల్లీ వచ్చామని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఒకవేళ విభజన అంటూ జరిగితే రాయలసీమకు అన్యాయం జరగకూడదన్నారు. కేంద్రం రాయల్ తెలంగాణ అంశాన్ని కూడా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.  ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటే.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ఇప్పుడు తెలంగాణ నేతలతోపాటు సీమాంధ్ర నేతలు కూడా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందన్న ప్రచారం చేస్తుండడం కొసమెరుపు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: