మన పూర్వీకులు మనకు పెట్టిన ఆచారాలను ఇప్పుడు కాలం మారిందనే పేరిట తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయా సాంప్రదాయాల్లో నిగూడంగా ఎంతో పరమార్థం దాగివుంది. ఆషాడం రాగానే కొత్తగా పెళ్లయిన అమ్మాయి పుట్టింటికి చేరే విషయమూ తెలిసిందే. పెళ్లయిన తర్వాత వచ్చే తొలి ఆషాడ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు, అత్తగారు ఒకే ఇంట్లో ఉండరాదనే నియమం ఉంది. ఈ నెలలో అత్తాకోడళ్లు ఒకే గడప దాటకూడదనేది మన తెలుగువారి ఆచారం. సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ ఆచారంలో పలు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన జంట ఈ నెలలో కలిసివున్న కారణంగా గర్భంవస్తే బిడ్డ పుట్టేప్పటికి చైత్ర, వైశాఖ మాసాలొస్తాయి. అంటే అది ఎండాకాలం అన్నమాట. భగ భగ మండే ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారు.
ఆషాడం అంటేనే వానాకాలం ప్రారంభం
ఇక రెండోది ఆషాడంలో కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదన్న నియమం వెనుకాలా అర్థం దాగివుంది. ఆషాడం అంటేనే వానాకాలం ప్రారంభంలో వస్తుంది. ఏరువాక మొదలై పొలం పనులు జోరందుకునే సమయం ఇది. ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటివారు అతిథి మర్యాదలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడతారు. మరోవైపు కొత్త భార్యపై మోజుతో మగవాళ్లు సైతం పొలం పనులను నిర్లక్ష్యం చేస్తారని కూడా ఈ నియమం పెట్టారు. పెళ్లయిన మొదట్లో భార్యా భర్తలకు విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉండడం సహజమే. ఈ మాసంలో దూరంగా ఉంటే ఎడబాటు బాధ వారికి తెలుస్తుంది. విరహం ప్రేమను మరింత పెంచుతుంది. వారు ఎల్లకాలం కలిసే ఉంటూ కష్ట సుఖాల్లో పెనవేసుకునేలా చేస్తుంది. అందుకే మన పెద్దలు ఆచరించిన అనేక సాంప్రదాయాలు అత్యంత అర్థవంతమైనవి.