రెండు రాష్ట్రాల మ‌ధ్య‌ కావేరి చిచ్చు

T Bhoomesh
కావేరి న‌దీ జ‌లాల వివాదంతో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఆ రాష్ట్రంలోని రైతులు సంబరాలు చేసుకుంటుండగా, కర్ణాటక రాష్ట్రంలో అన్న‌దాత‌లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్త‌గా బంద్‌లు, నిరసనలు ఊపందుకున్నాయి. మాండ్యాలో మంగళవారం ఉదయం నుంచి బంద్‌ కొనసాగుతోంది. బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రాకపోకలకు అంతరాయమేర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు కూడా రోడ్డెక్కడంతో ఆందోళన ఉద్ధృతమైంది.


బంద్ కార‌ణంగా పలు జిల్లాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కావేరి జలాలు విడుదల చేయెద్దంటూ రైతులు నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను సైతం ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. రైతుల ఆందోళనల దృష్ట్యా 2,400 మంది పోలీసులు నిరసనల ప్రాంతాల్లో మోహరించారు. 


 తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల కావేరి జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో.. సుప్రీం తీర్పును వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావేరి జలాల వివాదంపై మంగళవారం అఖిలపక్ష భేటీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. కావేరి జలాల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమావేశంలో చర్చించనున్నారు. కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కావేరి జలాలు విడుదల చేయడం సాధ్యం కాదని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నారు. 


మరోవైపు ఒప్పందం ప్రకారం కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని తమిళనాడు స్పష్టం చేసింది. కావేరి జలాలు విడుదల చేయాలని గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 15వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. రైతుల ఆందోళ‌నతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య మ‌రోసారి సంబంధాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: