హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నిన్న సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా బంద్‌కు, తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు పూర్తిగా బంద్‌ను పాటిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో మాత్రం బస్‌లు, వ్యాపార సంస్థలు, బడులు అన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఉదయం నుంచే టీ-జేఏసీ ప్రతినిధులు, విద్యార్థి సంఘం ప్రతినిధులు, టీఆర్ఎస్ క్యాడర్ జిల్లాలోని ఆయా ఆర్టీసీ బస్ డిపోల ముందట బైఠాయించారు. ధర్నాకు దిగారు. డిపోలకు ఉద్యమకారులు తాళాలు వేశారు.
డిపోల నుంచి ఒక బస్‌ను కూడా కదలకుండా చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు సాగుతున్నాయి. బంద్ కొనసాగుతుంది. సిరిసిల్లలో తెలంగాణవాదులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాల దాడి తమ శరీరంపై పడ్డవి కావనీ, అవి తమ మనసు మీద పడ్డవనీ టీజేఏసీ ఛైర్మన్ కోదండరామిరెడ్డి అన్నారు. వచ్చే సెప్టెంబర్ 30న జరుపతలపెట్టిన తెలంగాణ మార్చ్ సందర్భంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు తగు గుణ పాఠం చెబుతామనీ హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ నేతలు, పోలీసుల తీరుకు నిరసనగా తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: