షర్మిళ ఎక్కడ?

 హైదరాబాద్: ‘మీ రాజన్న కూతుర్ని, మీ జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిళ’... అంటూ గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుని, ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిళ ఉన్నఫలంగా కనిపించకుండా పోయింది. ఆమె అగుపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఆస్తుల కేసులో విచారాణకు పిలిచి మే 27న జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు పంపిన విషయం విధితమే. ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ...జగన్ జైలుకు వెళ్లడంతో వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఆమెకు తోడుగా, నీడగా షర్మిళ కూడా రాష్ర్ట వ్యాప్తంగా జరిగిన 18అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గంలో పర్యటించింది.  అప్పటి వరకు షర్మిళ ఎక్కడా కూడా వేదికలు ఎక్కింది లేదు. రాజకీయ ప్రసంగాలు చేసింది లేదు. తన సోదరుడు జైలుకు వెళ్లడంతో అనూహ్యామైన పరిస్థితుల్లో తల్లీకూతుళ్లిద్దరూ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకుని తిరిగారు. అచ్చం రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ‘చెయ్యి’ ఊపిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. వారు పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ ప్రసంగాలు వినివేందుకు, వారిద్దర్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. వచ్చినట్లుగానే ఓట్ల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో షర్మిళ చేసిన ప్రసంగాలు అందర్నీ ఆలోచింపచేశాయి. ముఖ్యంగా సీబీఐ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ గా చేసుకుని సంధించిన ప్రశ్నలు ప్రత్యర్ధులు బిత్తరపోయే విధంగా చేశాయి. క్షీణావస్థలో ఉన్న కాంగ్రెస్ ను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వరుసగా రెండుపర్యాయాలు అధికారంలోకి తేవడమే తమ కుటుంబం చేసిన పాపామా? రాష్ట్రంలోని కోట్లాది పేద ప్రజలభ్యున్నతీ కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పా? ప్రజలకు మంచి చేయడమే తప్పా?రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తప్పా? రెండున్నర ఏళ్లుగా జగనన్న ప్రజల్లో ఉండటమే తప్పా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి భవిష్యత్ లో రాహూల్ గాంధీని దేశ ప్రధాని చేయాలని దివంగత రాజశేఖర్ రెడ్డి అనడమే తప్పా? రాష్ర్టంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నాన్న రాజశేఖర్ రెడ్డి కష్టపడినందుకు గానూ బహుమానంగా సోనియమ్మ మా కుటుంబాన్ని రోడ్డు పాల్జేసిందా? జగనన్న ను జైలుకు పంపిందా? అంటూ సంధించిన ప్రశ్నలు ప్రజల్ని ఆలోచింపచేయగా, ప్రత్యర్ధులను ఇరకాటంలో పడేశాయి. ఘాటుగా, సూటిగా విమర్శనాస్ర్తాలను ఎక్కుపెట్టి అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకున్న షర్మిళను చూసి అందరూ భయపడ్డారు. ఆమె ప్రసంగాలు, చరీష్మాతో కాంగ్రెస్, టీడీపీ బొక్కాబోర్లపడ్డాయి. ఆమెను తట్టుకోవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చాయి. ఉప ఎన్నికల సందర్భంగా రాత్రింబవళ్లు తిరిగి వైఎస్ఆర్ పార్టీ విజయదుదుంబి మోగించడంలో కీలక పాత్ర పోషించిన షర్మిళ ఆ తరువాత ఒక శ్రీకాకుళం పర్యటన మినహాయించి మరెక్కడా కనిపించలేదు. దశాబ్దాల చరత్ర కలగిన వాళ్ల గుండెల్లో రైళ్లను పరుగెత్తించిన షర్మిళ ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించడం లేదు. షర్మిళ కనిపించకపోవడంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.  రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి షర్మిళనే ప్రధాన నేతగా మారుతుందనుకుంటున్న క్రమంలో ఆమె అగుపించకపోవడంతో కుటుంబంలో వచ్చిన విభేదాలే కారణంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ భార్య భారతి, షర్మిళ మధ్యన వచ్చిన విభేదాల వల్లనే షర్మిళ కొంత సైలంటుగా వుందనే వాదన తెరపైకి వచ్చింది. ఉప ఎన్నికల్లో ఓ ఊపు ఊపిన షర్మిళ తరువాత ఎక్కడ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో షర్మిళ క్రీయాశీలక రాజకీయాల్లో వస్తారా? లేక ఇంటికి పరిమితమవుతారా? అనేది కాలమే నిర్ణయించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: