సమన్వయం సాధ్యమేనా?

 హైదరాబాద్: కేంద్రంలోని యూపీఏ సర్కార్ లోని భాగస్వామ్య పార్టీలయిన కాంగ్రెస్- నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ ల మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీ ఏర్పడింది. ప్రధానమంత్రి మన్మోహన్, యూపీఏ ఛైర్మన్ సోనియాతో ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ప్రపుల్ పటేల్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేంద్ర కేబినెట్ సమావేశానికి డుమ్మాకొట్టిన ఎన్సీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డట్లు వార్తలొచ్చాయి. ఎన్సీపీ నేతలు కూడా తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. యూపీఏలోనే కొనసాగుతామనీ ఆ పార్టీ ప్రకటిస్తూనే యూపీఏ భాగస్వామ్య పార్టీల పట్ల కాంగ్రెస్ చులకన భావంతో ఉన్నట్లు ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ప్రపుల్ పటేల్ మండిపడ్డ విషయం విధితమే. గత 9రోజులుగా ఆ రెండు పార్టీల మధ్యన జరుగుతున్న ప‘వార్’ను సోనియాగాంధీ చల్లబర్చారు. ఎన్సీపీ అధినేత ప‘వార్’ మొత్తబడ్డారు. కేంద్రంలో 2వ స్థానం గురించి మొన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరగిన శరద్ పవార్ నాయకత్వంలోనీ ఎన్సీపీ సోనియా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ఏర్పాటుతో చల్లబడ్డది. అయితే, తాత్కాలికమా? శాశ్వతామా? అనేది సమన్వయ కమిటీ భేటీలను బట్టి, తీసుకునే నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. ఇక మీదట ఈ రెండు పార్టీల మధ్యన ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా ఉండేందుకుగానూ ఢిల్లీ, ముంబాయి స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కనీసం నెలకొకసారైనా ఈ కమిటీలు కూర్చోని సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకుని ముందుకు సాగేందుకు ఒక నిర్ణయానికి వచ్చాయి.  యూపీఏకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా భాగస్వామ్య పార్టీల సంప్రదించకుండా కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందనీ గత 9రోజుల కిందట యూపీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ఎన్సీపీ బాంబు పేల్చిన విషయం విధితమే. కేంద్రం నుంచి తప్పుకుని, యూపీఏకు బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పడంతో ఏకంగా ప్రధాని, సోనియానే రంగంలోకి దిగడంతో తన మనసును మార్చుకున్నది. మహారాష్ర్టలో కూడా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కూడా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో ఇక మీదట తామంతా ఒక్కటేననీ ఎన్సీపీ ప్రకటించింది. రాజీనామాల డ్రామాల పేరుతో ఎన్సీపీ కొన్ని డిమాండ్లను నెరవేర్చుకోవచ్చు. అయితే, ఒకసారి మన రాష్ర్టంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ విషయానికి వస్తే గడిచిన 8నెలల్లో కేవలం రెండంటే రెండుమార్లు మాత్రమే భేటీ అయ్యింది.  రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ కడుదయనీయంగా మారింది. సీఎం-పీసీసీ మధ్య సమన్వయం లేదు. మంత్రులకు-ఎమ్మెల్యేలకు పడదు. ఇక ఎంపీలు సరేసరి. సందట్లో సడేమియా అన్నట్లుగా ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన చిరంజీవి మరోవైపు. వీరందర్ని సమన్వయం చేసేందుకు గులాంనబీ అజాద్ పర్యవేక్షణలో సమన్వయ కమిటీ వేశారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యల పరిష్కారానికి క్రుష్టి చేస్తుందన్నారు. ఈ కమిటీ రెండుసార్లు కూర్చుంది. అప్రతిష్టపాలైందే తప్ప సాధించిందేమీ లేదు. ఇక తాజాగా మహారాష్ర్టలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఎపీని తీసుకున్నప్పుడు మహారాష్ర్టలో కూడా ఈ కమిటీ పెద్దగా సాధించేదేమీ లేదనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ప్రస్తుతానికి ఎన్సీపీ నేతల్ని చల్లార్చడానికి వేసిందే తప్ప మరొకటి కాదనీ పరిశీలకులు భావిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: