‘సీమ కోసం బైరెడ్డి దీక్ష షురూ’

 హైదరాబాద్: రాష్ర్టాన్ని ఉంచితే ఒకటిగా ఉంచండి, లేదంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణగా మూడుగా విభజించాలనే డిమాండుతో పాటు, రాయలసీమపై రాష్ర్టంలోని అన్ని ప్రధాన పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలనీ రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూల్ లో తన నాలుగు రోజుల దీక్షను ప్రారంభించారు. సీమ ఉద్యమాన్ని మరింత ఉధ్రుతం చేసేందుకుగానూ ఆయన ఈ దీక్షను మొదలుపెట్టారు. దీక్షా స్థలానికి భారీగా ఆయన మద్దతుదారులు, సీమ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడాలని కోరుకుంటున్నవారు చేరుకుంటున్నారు. తొలుత నిరాహార దీక్షలతో తన పోరాటానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా నిర్ణయం చేయడానికి పావులు కదుపుతున్నారనీ, ఇక ఇప్పుడు కూడా తాను చూస్తూ ఊరుకుంటే తమ ప్రాంత ప్రజలకు మరింత అన్యాయం చేసినట్లే అవుతుందనేది ఆయన వాదన. తాను చేపట్టే ఉద్యమం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగితే, అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు వెనకాడబోననీ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. బైరెడ్డి రాయలసీమ కోసం నిరాహార దీక్షకు దిగుతుండటంతో టీడీపీలో మళ్లీ ప్రాంతీయ లొల్లి మొదలైంది. దీక్షపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలోని అన్ని ప్రధాన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇస్తే దాంట్లో రాయలసీమ గురించి కూడా ప్రస్తావించాలనీ బైరెడ్డి డిమాండు చేస్తున్నారు. టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వనున్నట్లు వార్తొలస్తున్న క్రమంలో అదే పార్టీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతీయ వాదాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ర్టాన్ని వుంచితే సమైక్యంగా ఉంచండి, లేదంటే రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయాల్సిందేనంటూ బైరెడ్డి స్వరాన్ని పెంచారు.  ఉన్నఫలంగా బైరిడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రాంతీయ లొల్లిని అందుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బైరెడ్డి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడా? లేక ఆయనను ఎవరైనా వెనక నుంచి నడిపిస్తున్నారా? అనే దానిపై కూడా పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మాత్రం చంద్రబాబే ఈ కొత్త నాటకానికి తెరలేపారనీ అంటోంది. టీడీపీ మాత్రం అలాంటిదేమీ లేదనీ, త్వరలోనే తెలంగాణకు అనుకూలంగా బాబు లేఖను ఇవ్వనున్నట్టు తెలంగాణ తమ్ముళ్లు చెబుతున్నారు. మొత్తనికి బైరెడ్డి దీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీక్ష తరువాత రాయలసీమలో సమీకరణలు మారే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: