కాయ్ రాజా కాయ్: తెలంగాణ రుచి కాస్కోండి

హైదరాబాద్: ఆగస్టు 20 తరువాత తెలంగాణ ఉద్యమం రాజుకుంటుందా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఔననే అంటున్నాడు. 20దాక ఒపిక పడుదాం. తరువాత తెలంగాణను ఎట్లా సాధించుకుందామో అట్లనే సాధించుకుందామంటున్నారు. కేసీఆర్ గత కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. కేసీఆర్ మౌనంపై ముఖ్యంగా తెలంగాణకు తెలుగు తమ్ముళ్లు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా రోజుల తరువాత కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. అటు సీమాంధ్ర నేత నుంచి, ఇటు తెలంగాణ నేత నుంచి మాటల యుద్ధం ప్రారంభమైంది.రాయలసీమ రుచి చూపిస్తామనీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటుంటే దానికి కౌంటర్ గా తెలంగాణ రుచి కూడా చూపిస్తామనీ కేసీఆర్ అంటున్నాడు. మొత్తానికి రాష్ర్టంలో త్వరలో ఉద్యమాలతో అట్టుడుకిపోవడం తథ్యంగా కనిపిస్తోంది. టీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ వీడ్కోలు వేదికగా కేసీఆర్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.  ఉద్యమ వేడి చల్లారలేదనీ, తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ చెప్పడంతో కొంత శాంతంగా ఉన్నామే తప్ప వేరొకటి కాదన్నారు. త్వరలోనే తెలంగాణపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకుంటామనే సంకేతాలు వచ్చిన దరిమిలా ఒపికతో ఉన్నామే, తప్ప ఉద్యమాన్ని ఉధ్రుతం చేయడం ఎంతసేపన్నారు. దీనితో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రగల్చడానికి దూకుడు పెంచాడనీ వేరే చెప్పనక్కర్లేదు. తెలంగాణకు కేంద్రంలో అనుకూలంగా పావులు కదులుతున్నాయనీ వార్తలొస్తున్న క్రమంలో కర్నూల్ లో రాయలసీమ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ‘మేలుకొలుపు’పేరిట 92గంటల దీక్షను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బైరెడ్డి తెలంగాణపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. సీమ ఇవ్వకుండా తెలంగాణ వాళ్లు అడ్డుకుంటున్నారనీ, సీమకు అడ్డుపడితే రాయలసీమ రుచి ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. బైరెడ్డి మాట్లాడిన కొన్ని గంటలకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణను ఎలాసాధించుకోవాలో తమకు తెలుసు. మంచి మాటకు ఇస్తామన్న తెలంగాణ ఇవ్వండి. లేదంటే ఆగస్టు 20 తరువాత కదనరంగంలోకి దూకుడేనంటూ కేంద్రానికి పరోక్షంగా హెచ్చరిక సంకేతాలను పంపారు. 15రోజుల పాటు కేంద్రానికి గడువు ఇద్దాం. ఆ గడువు లోపు తెలంగాణ ఇస్తే సరి. లేకుంటే తెలంగాణ రుచి ఏమిటో తాము కూడా చూపెడుతామనీ కేసీఆర్ తనదైనశైలిలో హెచ్చరించారు. లక్ష్యం చేరకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఆపుతారనీ ఎవరూ అనుకోవద్దంటున్నారు. ఉద్యమాన్ని ఉద్రుతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి కలిసి వచ్చే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమై చర్చిస్తామన్నాడు.  ఉద్యమాన్ని ఎలా రగిల్చాలో తమకు తెలుసుననీ, దీనిలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దంటున్న తీరును చూస్తే ఉద్యమానికి కేసీఆర్ కూడా ‘సై అంటే సై, ఢీ అంటే ఢీ’ అనే విధంగా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపించారు. కేసీఆర్ కదనరంగంలోకి దిగితే ఆ పరిస్థితులే వేరుగా ఉంటాయనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మొత్తానికి కేసీఆర్ దూకుడు పెంచినట్లే అగుపిస్తోంది. తెలంగాణ ఉద్యమం మరోమారు తీవ్రరూపం దాల్చే సూచనలే కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: