సైనాకు ఘన స్వాగతం

హైదరాబాద్: లండన్ లో జరుగుతున్న ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన స్టార్ షట్లర్ సైనా నేహ్వాల్కు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది. లండన్ లో భారత త్రివర్ణ పతకాన్ని రెప రెపలాడించిన మన హైదరాబాదీ సైనా కొద్ది సేపటి కిందనే హైదరాబాద్కు చేరుకుంది. ఈమెకు రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలికింది. షాప్ అధికారులతో పాటు, ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలిచ్చి ఘన స్వాగతం పలికారు. విమానశ్రయం నుంచి సైనాను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీ వరకు తీసుకెళ్లారు. కాంస్య పతకాన్ని సాధించిన సైనాను చూసేందుకు భారీ యెత్తున విద్యార్థులు, అభిమానులు తరలివచ్చారు. అభిమానులు, రాష్ర్ట ప్రభుత్వాధికారులు, కుటుంబ సభ్యులు, రాష్ర్ట, జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులతో శంషాబాద్ ఏయిర్పోర్టు కిక్కిరిసిపోయింది. ఆమెతో చేతులు కలిపేందుకు చాలా మంది ఎగబడ్డారు. ఒలంపిక్స్లో సాధించిన కాంస్య పతకం చూపెడుతూ మీడియా ప్రతినిధులకు ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్యన సైనాను ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పైకి తీసుకెళ్లారు. ఇదే విమానంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: