తెలంగాణలో బ్రాహ్మణుల దశ తిరిగినట్టేనా..!?

Chakravarthi Kalyan
తెలంగాణ వచ్చాక... ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకు మంచి స్థానమే దక్కుతోంది. సీఎం కేసీఆర్ కు బ్రాహ్మణుల పట్ల ప్రత్యేక గౌరవం ఉండటం ఇందుకు ఒక కారణం.. హైదరాబాద్ లో బ్రాహ్మణ భవన్ కట్టిస్తాననన్న ఆయన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల స్థితిగతులను అధ్యయనం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ బ్రాహ్మణ సంక్షేమ సమితి తాజాగా తొలిసారిగా ప్రభుత్వ సలహాదారు కేవీరమణాచారి అధ్యక్షతన సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానమైంది... గోపన్ పల్లిలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి పది కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. సదన్ నిర్మాణం, ఆరోగ్యబీమా విధివిధానాలు రూపకల్పన, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వేదపాఠశాలలు, వేదవిద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.


అలాగే.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బ్రాహ్మణ విద్యార్థులకు 20 లక్షల రూపాయల వరకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాకుండా పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకునే వారికి వసతి సౌకర్యం కల్పించాలని కూడా బ్రాహ్మణ పరిషత్ తీర్మానించింది. అంతేకాదు.. సంక్షేమ పరిషత్ కు ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. 

అర్హులైన బ్రాహ్మణులకు కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని పరిషత్ నిర్ణయించింది. ఆసరా ఫించన్లు కూడా అందించాలని నిర్ణయించారు. వీటితో పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో విశిష్ట పురస్కారాలు పొందిన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని.. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కోర్సుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి సరస్వతి విశిష్టా ప్రశస్తి పథకం అమలు చేయాలని బ్రాహ్మణ పరిషత్ నిర్ణయించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: