నిన్నమొన్నటి వరకూ పవన్ కల్యాణ్ జనసేన అంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్లూ తెలుగు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ సైడ్ రోల్ కే పరిమితం అయ్యారు. కానీ..ఇక ముందు పరిస్థితి అలా ఉండదట. పవన్ సీరియస్ గా పాలిటిక్స్ పై దృష్టి పెడతారట. ఫుల్ టైమర్ గా మారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారట.
మరి రాజకీయాల్లో జనం నమ్మకం గెలుచుకోవడం సినిమాల్లో నటించినంత ఈజీ కాదు. అందుకే పవన్ కల్యాణ్ ప్రజల మనసు గెలుచుకునేందుకు వైఎస్సార్ బాటలో నడవాలని నిర్ణయించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన కీలక వ్యూహాల్లో పాదయాత్ర ఒకటన్న సంగతి ఆనాటి రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరైనా అంగీకరిస్తారు.
పాదయాత్ర తర్వాతే వైఎస్ ప్రజానాయకుడిగా ఎదిగారు. ఓ ప్రాంత నాయకుడి స్థాయి నుంచి అమాంతం తెలుగు నేతగా ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందుకే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నారట. ఈ యాత్రను అనంతపురం జిల్లాతో ప్రారంభిస్తారట.
ఇప్పటికే ఆయన అనంతపురం జిల్లాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలకు అక్కడి నుంచే పోటీకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.అందుకే పాదయాత్రకు కూడా అనంతపురం జిల్లానే వేదికగా చేసుకుంటున్నారు. పవన్ పాదయాత్ర కళ్యాణదుర్గం నుంచి ప్రారంభమై మడకశిర, పెనుకొండ, గోరంట్ల, పుట్టపర్తి, ధర్మవరం మీదుగా అనంతపురం వరకు కొనసాగుతుంది. అనంతపురంలో యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు.