చంద్రబాబు- జగన్ చేతులు కలిపితే ఇలాగే ఉంటుందా..!?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ- వైసీపీ నేతలు నువ్వా నేనా అన్న రీతిలో విమర్శలు గుప్పించుకున్నారు. అసెంబ్లీ కొత్తదైనా పార్టీ మధ్య పోరు పాతదే అని నిరూపించారు. సై అంటే సై అంటూ సవాళ్లు చేసుకున్నారు. చదువుల దగ్గర నుంచి ఆస్తుల వరకూ అన్ని అంశాలపైనా మాటల యుద్ధం జరిగింది. 



మరి అలాంటి చంద్రబాబు- జగన్ చేతులు కలిపితే ఎలా ఉంటుంది. సయోధ్యకు వచ్చి ఇద్దరూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఊహే చాలా విచిత్రంగా ఉంది కదూ. ఇది దాదాపు అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అసాధ్యం ఒక రూపంలో మాత్రం సుసాధ్యమైంది. జగన్, చంద్రబాబు చేతులు కలపకపోయినా.. కలిపితే ఎలా ఉంటుందన్న ఊహకు ప్రాణం వచ్చింది. 


ఇప్పుడు చంద్రబాబు తాజాగా చేసిన మంత్రి వర్గ విస్తరణను పరిశీలిస్తే.. ఇది చంద్రబాబు- జగన్ ఉమ్మడి క్యాబినెట్ లాగానే ఉంది. చంద్రబాబు- జగన్ ఇధ్దరూ కలసి కూర్చుని చర్చించుకుని తమ పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు కావాలో నిశ్చయించుకుని చేసిన ఏర్పాటుగా ఉంది. అవును మరి.. మొత్తం 26 మంది మంత్రుల్లో నలుగురు వైసీపీ నుంచి వచ్చిన వారే. 


ఐదుగురి పోస్టులు ఊడబీకి.. కొత్తగా 11 మందిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు చంద్రబాబు.. ఈ 11 కొత్త ముఖాల్లో నాలుగు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి.. ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబును బండబూతులు తిట్టి జనం ఓట్లతో గెలిచినవారే. ఇప్పుడు వారు చంద్రబాబు కేబినెట్లో మంత్రులయ్యారు. ఒకవేళ వైసీపీ ప్రతిపక్షం కాకుండా టీడీపీ మిత్ర పక్షంగా ఉండి ఉన్నా.. మంత్రివర్గ కూర్పు ఇలాగే ఉండి ఉండేదేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: