తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెపుతున్నారు. విశ్వనగరం అంటే ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉండాలి ? అక్కడ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉండాలి ? కానీ గత వారం రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే హైదరాబాద్‌ను కేసీఆర్ విశ్వనగరంగా మార్చడం సరే ఈ నగరం వివాదాల నగరంగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. హైదరాబాద్‌కు ఇండియా చిత్రపటంలో ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఐటీ రంగంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు, మతాల ప్రజలకు, భిన్న సంస్కృతులకు ఇది నిలయం.
అయితే ఇప్పుడు ఎలాంటి చట్టవ్యతిరేక పనులు చేసేందుకు అయినా ఇదో సేఫ్ ప్లేసా ? అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. వారం రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ ఉందంతంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. వీరిని సిట్ వరుసగా విచారిస్తోంది. ఈ డ్రగ్స్ లింకులు హైదరాబాద్‌లో మూలమూలనా విస్తరించినట్టు తెలుస్తోంది.
సిట్ విచారణలో వెల్లడవుతోన్న సంచలన విషయాలు చూస్తుంటే విదేశాల నుంచి కూడా ఎవరైనా స్వేచ్ఛగా ఇక్కడకు వచ్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారో ? అర్థమవుతోంది. థాయ్‌లాండ్, నైజీరియాతో పాటు కొన్ని ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చి తిష్టవేసి మరీ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇక గోవాతో పాటు దేశంలోని పలు ప్రముఖ నగరాల నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రతి రోజు జరుగుతోన్న దాడుల్లో నార్త్‌కు చెందిన ఎంతోమంది అమ్మాయిలు పట్టుబడుతున్నారు.
అటు అమ్మాయిలతో వ్యభిచారం, ఇటు డ్రగ్స్ కల్చర్ ఇక్కడ ప్రకంపనలు రేపుతుంటే ఇక్కడ గన్ కల్చర్ ఉందంతం కూడా ఎక్కువే ఉన్నట్టు స్పష్టమవుతోంది. నగరంలో శుక్రవారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. విక్రమ్ గౌడ్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారు జామున బ్రహ్మముహూర్తం ఉందని గుడికి బయల్దేరేందుకు విక్రమ్ గౌడ్ తన భార్యతో కలిసి బయలుదేరారు. ఈ సమయంలోనే దుండగులు విక్రమ్ గౌడ్ పై కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలకు గురైన విక్రమ్‌గౌడ్‌ను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీరం నుంచి రెండు బుల్లెట్లను కూడా బయటకు తీశారు.
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎటు పోతోంది ? ఇక్కడ భద్రత వ్యవస్థ ఎంత డొల్లగా ఉంది ? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి ? రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై చెపుతోన్న మాటలు కేవలం నీటిమీద రాతలుగానే మిగిలిపోనున్నాయా ? అంటే అవుననే సందేహాలే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. మరి ఈ అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.