కేసీఆర్ కు, చంద్రబాబుకు తేడా అదే..!!

Vasishta

          తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకే పార్టీలో దశాబ్దాలపాటు కలసి పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయ్యారు. ఒకరిది ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం అయితే.. మరొకరిది మూడేళ్ల అనుభవం. అయినా కేసీఆర్ డీల్ చేసే విధానానికి, చంద్రబాబు వ్యవహరించే పద్ధతికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.


          తెలుగు రాష్ట్రాల్లో గత నెల రెండు అనుకోని సంఘటనలు జరిగాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో జరిగితే.. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగింది. రెండు దళితులపై దాడికి సంబంధించినవే. గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సమయంలో అగ్రవర్ణాలకు, దళితులకు మధ్య గొడవ జరిగింది. దీంతో దళితులను సామాజిక బహిష్కరణ చేసేరనే ఆరోపణలున్నాయి. ఇదంతా ఆ ఊళ్లోని రెండు కులాల మధ్య జరిగిన వ్యవహారం. అదే నేరెళ్లలో ఇసుకలారీలు తగలబెడుతున్నారనే కారణంలో కొంతమందిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిలో కొంతమంది దళితులు కూడా ఉన్నారు. అయితే దళితులం కాబట్టే తమను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.


          సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విపక్షాలు అంతెత్తున లేస్తుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. గరగపర్రులో ఈ సంఘటన వెలుగులోకి రాగానే అక్కడేదో జరిగిపోతోందని గగ్గోలుపెట్టారు. అంతే.. చంద్రబాబు ప్రభుత్వం కూడా హైరానా పడిపోయింది. ఏమైందో ఏమోనని కంగారుపడింది. వెంటనే రంగంలోకి దిగి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, మంత్రులు, అధికారులు.. అంతా క్యూ కట్టారు. అడగకపోయినా మీరు బాధితులంటూ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించలేం. ఇక్కడ ఎక్కడా ప్రభుత్వ జోక్యం లేదు. అయినా ప్రభుత్వం తాను తప్పు చేసినట్లు అంగీకరించింది. అది చంద్రబాబు పిరికితనానికి నిదర్శనం.


          అదే నేరెళ్ల విషయానికి వస్తే.. పోలీసులు నేరుగా కొంతమంది వ్యక్తులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులంటే ప్రభుత్వమే. అక్కడ దళితులున్నారా.. లేదా అనేదానితో సంబంధం లేకుండా ఈ ఇన్సిడెంట్ అవాంఛనీయం కాబట్టి దాన్ని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఆ సిచ్యుయేషన్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. కేవలం దళితులను మాత్రమే టార్గెట్ చేసుకుని లాఠీ ఛార్జ్ చేస్తారనడం విపక్షాల మూర్ఖత్వానికి నిదర్శనం. సరే.. అయిందేదో అయింది. ఈ సంఘటన తర్వాతా చాలా కాలం పాటు కనీసం బయటకు రాలేదు. బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం ఎక్కడా కంగారు పడలేదు. ధైర్యంగా ఎదుర్కొంది. “ఎస్.. ఇసుకలారీలను తగలబెడుతున్నవాళ్లపై లాఠీ ఛార్జ్ చేశాం. అక్కడున్నది దళితులా.. కాదా అని చూడలేదు. గాయపడ్డవారిలో ఒకరో ఇద్దరో దళితులు ఉండొచ్చు. దళితులను టార్గెట్ చేసుకుని లాఠీ ఛార్జ్ చేయండని ఏ ప్రభుత్వం చెప్పదు..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.


          అదీ కేసీఆర్ కు, చంద్రబాబుకు తేడా.! తాను చేసిన దాన్ని ధైర్యంగా చెప్పగల నేర్పు, సత్తా కేసీఆర్ సొంతం. అదే చంద్రబాబు అయితే ఇలాంటి ఇష్యూలపై స్పందించడానికి కూడా ముందుకురారు. అనవసరమైన విషయాలపై గంటలకొద్దీ లెక్చర్లు పీకుతుంటారు. కానీ కేసీఆర్ మాత్రం సూటిగా, స్పష్టంగా క్లారిటీ ఇస్తారు. కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఇంకోసారి ఆ విషయంపై విపక్షాలు మాట్లాడ్డానికి కూడా సాహసించవు. అంత క్లారిటీ ఇస్తారు. కానీ చంద్రబాబు ఏం చెప్పినా, ఎంత చేసినా ఆ క్లారిటీ ఉండదు. చేసింది కూడా సరిగా చెప్పుకోలేరు. అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పైన మాట్లాడ్డానికి కూడా అంగీకరించరు. ఈ విషయంలో కేసీఆర్.. చంద్రబాబు కంటే ఎంతో ముందున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: