జగన్ హేట్ కామెంట్స్ వెనుక స్ట్రాటజీ ఏంటో తెలుసా..!?

Vasishta

నంద్యాల ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ప్రతిపక్ష నేత జగన్ పదే పదే ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు..? వరుసగా హేట్ కామెంట్స్ చేయడం వెనక ఉద్దేశమేంటి ? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా జగన్ ఇలా విరుచుకుపడుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అయితే వీటన్నింటి వెనుక వేరే బలమైన కారణముందని తెలుస్తోంది. అదేంటో తెలుసా...?


ఈ నెల మూడో తేదీన నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్.. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలనిపిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఊరూవాడా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. పలు పోలీస్టేషన్లలో జగన్ పై ఫిర్యాదు చేశాయి. దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు.


ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం జగన్ వివరణ కోరింది. జగన్ కూడా ఎన్నికల కమిషన్ కు వివరణ పంపించారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. హామీలు అమలు చేయడం లేదనే ఆవేదన తోనే అలా మాట్లాడానని జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.


ఇంతలో జగన్ మరోసారి చంద్రబాబును టార్గెట్ గా చేసుకున్నారు. చంద్రబాబుకు ఉరిశిక్ష వేసిన తప్పులేదన్నారు. సీఎంను సైతాన్ తో పోల్చారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులనే కాదు.. వైసీపీ నేతలను సైతం నివ్వెర పరిచాయి. కోడ్ అమల్లో ఉన్నప్పుడు జగన్ చేస్తున్న ఇలాంటి కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.


అయితే జగన్ ఇలా వ్యాఖ్యానిస్తుండడం వెనుక వేరే ఉద్దేశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలను గుర్తు చేయడం ఒక ఎత్తయితే.. తన నవరత్నాల్లాంటి హామీలపై ప్రజల్లో చర్చ లేవనెత్తేలా చేయాలనేది జగన్ ఉద్దేశం అయి ఉండొచ్చనేది వారి అంచనా. ప్లీనరీలో తాను ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్లాలంటే చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎండగట్టాలి. అప్పుడే తన హామీలపై చర్చ జరుగుతుంది. ఇదే జగన్ కామెంట్స్ వెనుక అసలు రీజన్ అయి ఉండొచ్చని అంచనా. అంతేకాదు.. చంద్రబాబుపై ప్రజలను రెచ్చగొట్టడం కూడా మరో స్ట్రాటజీ. అందుకే ఈ మాటల దాడి ముందుముందు మరింత పుంజుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: