వచ్చే ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మహారసవత్తరంగా మారనుంది. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కప్పుల తక్కెడలు ఎక్కువవ్వనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో అధికార టీడీపీలోకి నిన్నటి తరం టాప్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వాణీవిశ్వనాథ్ 1990వ దశకంలో టాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ సినిమా రంగాల్లో టాప్ హీరోయిన్గా ఓ ఊపు ఊపేశారు.
తెలుగులో అగ్ర హీరోలందరితోను ఆమె ఆడిపాడింది. పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయిన ఆమె ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకీ నాయక సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరిసింది. ఈ సినిమాలో ఆమె మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఆమె టీడీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
చిత్తూరు జిల్లా నగరికి చెందిన టీడీపీ సీనియర్ నేతలైన ఆనం శ్రీహరినాయుడు, దూర్వాసులు నాయుడు, హరినాయుడు, రామానుజం చలపతి తదితరులు ఆదివారం చెన్నై వచ్చి వాణీవిశ్వనాథ్‌ను కలుసుకున్నారు. టీడీపీలో చేరాలని ఈ సందర్భంగా వారు ఆమెను ఆహ్వానించారు. టీడీపీలో చేరేందుకు ఆమె ఓకే చెప్పినట్టు వారు తెలిపారు.
ఇక టీడీపీలో చేరేందుకు ఓకే చెప్పిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తన అభివృద్ధికి కారణమైన తెలుగువారికి ఏదైనా చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నానన్నారు. ఇక చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం అంటే తనకు ఎంతో అభిమానం అని ఆమె చెప్పారు. ఇక దక్షిణ భారతదేశం మొత్తం చంద్రబాబు నాయకత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోందని ఆమె అన్నారు.
ఈ క్రమంలోనే తాను త్వరలోనే అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు ఆమె తెలిపారు. మరో సీనియర్ నటి కవిత టీడీపీకి గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో ఆమె స్థానాన్ని మరో సీనియర్ నటి అయిన వాణీ విశ్వనాథ్ ఇలా భర్తీ చేయడం విశేషం. వచ్చే ఎన్నికల నేపథ్యంలో మరికొంత మంది హీరోయిన్లు టీడీపీలో చేరేలా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు.