హైదరాబాద్: వాన్ పిక్ లో తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న రాష్ర్ట మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేస్తారా? చేయరా? ఇప్పుడంతటా ఇదే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. ధర్మాన నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తే ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు గీతారెడ్డి, సబితారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నాటి వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ధర్మాన ప్రసాదరావు కేబినెట్‌కు సంబంధం లేకుండా వాన్ పిక్ ప్రాజెక్టు అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌కు లాభం చేకూరే విధంగా 4 వివాదాస్పద జీవోలను జారీ చేసినట్లు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో పేర్కొన్నది. తాజాగా సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్ లో ధర్మానను ఐదో నిందితుడుగా పేర్కొన్న విషయం విధితమే.
ఇదే కేసులో నాల్గో నిందితుడుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, ఆరో నిందితుడైన బ్రహ్మనందరెడ్డిలను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. జైలుకు పంపించింది. ధర్మాన ఐదో నిందితుడుగా ఉన్నారు. దీనితో ఈయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలంటూ విపక్షాలు ముక్తకంఠంతోడిమాండు చేస్తున్నాయి. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో 4, 6 నిందితులను అరెస్టు చేసినప్పుడు 5వ నిందితుడైన ధర్మానను కూడా అరెస్టు చేస్తుందా? లేక కోర్టు వారంటు ద్వారా అరెస్టు చేస్తుందా? అనే దానిపై కూడా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ధర్మాన ప్రసాదరావు మాత్రం తానేమీ తప్పుచేయలేదనీ, కావాలనీ అసలే చేయలేదనీ అంటున్నారు. విపక్షాలన్నీ మంత్రి పదవీ నుంచి తప్పించాలనీ చేస్తున్న డిమాండు తగ్గట్టుగా తానే మంత్రి పదవీకి రాజీనామా చేసి న్యాయవ్యవస్థ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, రాష్ర్టంలోని మెజార్టీ మంత్రులు, ఇతర సీనియర్లు మాత్రం ధర్మానను రాజీనామా చేయకుండా కొంత ఒపిక పట్టాలంటున్నారు. రాజీనామా చేస్తే మరిన్ని సమస్యలు చుట్టుముట్టుతాయే తప్ప సమస్య పరిష్కారం కాదనీ పలువురు మంత్రుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఒక వేళ ధర్మాన ప్రసాదరావు నైతిక విలువలకు కట్టుబడి తప్పని సరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తే ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు గీతారెడ్డి, సబితారెడ్డి, పొన్నాల, కన్నాల పరిస్థితి ఎలా ఉండబోతది? నైతిక విలువలు ఒక ధర్మానకే వర్తిస్తాయా? మిగతా నలుగురు మంత్రులకు వర్తించవా? అనే వాదన బలంగా వినిపిస్తోంది. అభియోగంతోనే ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసిన మరుక్షణమే మిగతా నలుగురు మంత్రులతో పాటు ఇతర అభియోగాలు ఎదుర్కొంటున్న ఏరాసు ప్రతాప్ రెడ్డి, పార్థసారధి కూడా రాజీనామా చేయాలంటూ విపక్షాలు ఎలాగూ డిమాండు చేస్తాయి.
నైతిక విలువలకు కట్టుబడి వీరందరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే కిరణ్ కేబినెట్ పరిస్థితి ఏంటి? అనేది పెద్ద ప్రశ్నగా మారనున్నది. ఏది ఏమైనా గతంలో ఏ కేబినెట్ ఎదుర్కోని విచిత్రమైన పరిస్థితిని ప్రస్తుత కేబినెట్ ఎదుర్కొంటోంది. విలువలకు కట్టుబడి ఒకరు రాజీనామా చేస్తే వెంటనే నలుగురు రాజీనామా చేయక తప్పదు. మొత్తానికి రాష్ర్టంలోని కిరణ్ సర్కార్ ముందు పెను సవాళ్లే ఉన్నాయి. ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారో కాలమే నిర్ణయించాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: