మకాం మార్చబోతున్న జగన్..! పీకే సూచన మేరకే..!!?

Vasishta

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లు గడుస్తున్నా జగన్ మాత్రం ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూడా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉంది. అయితే ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు జగన్ హైదరాబాద్ కు గుడ్ బై చెప్పబోతున్నారు.


          వైసీపీ అధినేత జగన్ ఈ నెలాఖరులోపు తాడేపల్లికి రాబోతున్నారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉంటూ రాష్ట్రం వెలుపల నివాసం ఉండడం, అడపాదడపా రాష్ట్రంలో పర్యటిస్తూ ఉండడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీనే ఎన్నోసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించింది. రాష్ట్రంలో ఉండని నేత ఈ రాష్ట్రానికి ప్రతిపక్షనేత ఎలా అవుతారని ప్రశ్నించింది. ఇన్నాళ్లూ ఈ విమర్శలను భరించిన జగన్.. ఇకపై ఎంతమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.


          హైదరాబాద్ లోటస్ పాండ్ లో సకల హంగులతో ఇంటితో పాటు రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే రాష్ట్రం విడిపోవడంతో అనివార్యంగా జగన్ ఏపీకి రావాల్సి వస్తోంది. అయినా జగన్ మాత్రం లోటస్ పాండ్ నుంచే వ్యవహారాలను నడిపించారు. అధికార టీడీపీ మాత్రం ఏడాదిలోపే తట్టాబుట్టా సర్దేసుకుని ఏపీలో వాలిపోయింది. ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, ప్రతిపక్షనేత ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని సలహాదారు ప్రశాంత్ కిశోర్ సూచించడంతో జగన్ నిర్ణయం మార్చుకున్నారు.


          ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే జగన్ తన ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లికి మార్చబోతున్నారు. ఇక్కడ కూడా లోటస్ పాండ్ లో లాగే ఇల్లు, పార్టీ ఆఫీస్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ నేల 21వ తేదీ లండన్ నుంచి జగన్ ఇండియా రానున్నారు. 27వ తేదీన లేకుంటే దసరా రోజు పార్టీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.


          వచ్చే నెల 27వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచే అన్నింటినీ మానిటర్ చేయాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. ఈమేరకు కొత్త ఆఫీసులో అత్యాధునిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, వాటిని పార్టీ కార్యాలయంతో అనుసంధానించడం.. లాంటి పనుల్లో పీకే టీం బిజీగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: