విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంగవీటి రాధా కృష్ణ ఉరఫ్ వంగవీటి రాధా.. రాజకీయంగా నీరసపడుతున్నారా? ఆయన ప్రభావం పొలిటికల్‌గా తగ్గిపోతోందా? ఆయనను జగన్ వాడుకుని వదిలేశారా? ఆయనతో లాభం లేదని జగన్ డిసైడ్ అయ్యారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది తాజా పరిణామాలను గమనిస్తే..! ఇటీవల రెండు నెలల కిందట విజయవాడలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. వంగవీటి ప్రాబల్యం ఎంతగా తగ్గిపోయిందో అర్ధమవుతోంది. నిజానికి ఒకప్పుడు విజయవాడ బెబ్బులి అనిపించుకున్న వంగవీటి ఫ్యామిలీ.. ఇప్పుడు పిల్లిలాగా మారిపోయిందనే టాక్ ఊపందుకుంది.
విషయంలోకి వెళ్తే.. రెండు నెలల కిందట ఓ టీవీ ఇంటర్వ్యూలో వైసీపీ స్థానిక నేత, ప్రముఖ లాయర్ పూనూరు గౌతం రెడ్డి మాట్టాడుతూ.. వంగవీటి రాధా, రంగాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దేవుడి పటం వెనుక దాగి ఉందన్న కారణంగా పామును వదిలేస్తామా? అంటూ వంగవీటిపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు.. రంగా హత్యను సైతం సమర్ధించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. రంగా అభిమానులు, ఆయన కుమారుడు వంగవీటి రాధా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్ పెట్టేందుకు వెళ్తున్న రాధాను పోలీసులు అడ్డగించడం, ఆయన తల్లి స్పృహ కోల్పోవడం వంటి వి జరిగాయి.
దీంతో వెంటనే స్పందించి వైసీపీ అధినేత జగన్.. గౌతంరెడ్డిని సస్పెండ్ చేసి.. అసలేం జరిగిందో తేల్చుకోవాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజా పరిణామాలు మాత్రం రాధాకు మింగుడు పడడంలేదు. గౌతం రెడ్డి చేసిన కామెంట్లకు ఆయనను పార్టీ నుంచి వెలి వేస్తారని భావించిన రాధాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. నియోజకవర్గంలో గౌతమ్‌రెడ్డి అనుచరుడిగా పేరొందిన ఓ వ్యక్తికి డివిజన్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగిస్తూ స్వయంగా జగన్ నిర్ణయం తీసుకోవడంతో వంగవీటి రాధా అసంతృప్తితో ఉన్నారు. తాను సూచించిన మైనార్టీ నాయకుడిని కాదని మరో వ్యక్తికి అందులోనూ గౌతమ్‌రెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించడాన్ని రాధా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల నగరానికి వచ్చిన జగన్‌కు రాధాకు మధ్య ఈ నిర్ణయంపై చర్చ జరిగినట్లు సమాచారం. వారం రోజులుగా పార్టీ నాయకులకు రాధాకృష్ణ దూరంగా ఉంటున్నారు. ఫోన్లకు కూడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇటీవలే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి గౌతమ్‌రెడ్డి ఆయన అనుచరులు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. అయితే ఆ కలయిక బంధుత్వం పరంగానా? లేదా రాజకీయ పరంగానా? అన్న విషయంపై స్పందిం చేందుకు పార్టీ వర్గాలు సుముఖత వ్యక్తం చేయడంలేదు.
ఏది ఏమైనా గౌతమ్‌రెడ్డి పట్ల జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రాధా వర్గీయులు ఆయనను బలపరిచే సామాజిక వర్గ నాయకులు, పార్టీ కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈపరిణామం ఎంత దూరం దారి తీస్తుందో చూడాలి. వైసీపీలో వంగవీటికి జగన్ పొమ్మనకుండా పొగ పెడుతున్నట్టే కనపడుతోంది. మరో ట్విస్ట్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో వంగవీటి సెంట్రల్ సీటును జగన్ మల్లాది విష్ణుకు ఇస్తానని హామీ ఇచ్చినట్టు టాక్? ఇక తూర్పు సీటును జగన్ కమ్మ వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నాడట. అదే జరిగితే వైసీపీలో వంగవీటికి చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.