జగన్ చేస్తున్న మరో బిగ్ మిస్టేక్..!?

Vasishta

ఫిరాయింపుదార్లపై వేటు పడే వరకు సభకు హాజరకాకూడదన్న ప్రతిపక్ష వైసీపీ నిర్ణయం కరెక్టేనా? శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం వ్యూహాత్మక తప్పదమా? ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్నారా?

 

గడచిన మూడున్నరేళ్లలో ....  అధినేత ఏకపక్ష నిర్ణయాలతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న ప్రతిపక్ష  వైసీపీ మరో వ్యూహాత్మక తప్పదానికి పాల్పడిందని పలువురు రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఫిరాయింపుదార్లపై వేటు వేయించే లక్ష్యంతో సభను బహిష్కరించి అందివచ్చిన అవకాశాలను చేజేతులా దూరం చేసుకున్నారంటూ విశ్లేషిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సభను సజావుగా నిర్వహించడం లేదని  అరకొర  సమావేశాలతో .. మమ అనిపిస్తోందంటూ  వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. తాము ప్రభుత్వానికి సహకరిస్తున్నా ... కావాలనే తక్కువ రోజులు సభను నిర్వహించి తమ వాయిస్ వినిపించకుండా చేస్తోందని విమర్శలు కూడా చేసింది. అయితే సభ నిర్వహిస్తున్న సమయంలో బాయ్ కాట్ చేయడం ద్వారా భవిష్యత్ లో ఈ విమర్శలు ఎలా చేయగలుగుతారంటూ  టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  తాను తప్ప సభలో మరెవ్వరూ మాట్లాడకూడదన్న నైజంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు.


అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదన్న నిర్ణయంపై పలువురు వైసీపీ నేతలు కూడా మథనపడుతున్నట్టు సమాచారం. రుణమాఫీ అమలులో జాప్యం, పెరుగుతున్న సీజనల్ వ్యాధులు, వరదల కారణంగా నష్టపోయిన రైతులు, పోలవరం కాంట్రాక్ట్ మార్పు, రాజధాని ఆకృతుల నిర్దారణలో జరుగుతున్న జాప్యం  ఇలా ఎన్నో కీలక అంశాలున్న సమయంలో సభను బహిష్కరించడం వల్లే అధికార పార్టీకే ప్రయోజనం కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపుదార్లు వ్యవహారం స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్నందున తామేమి చేసినా ప్రయోజనం లేదంటున్నారు.


మరోవైపు కొందరు వైసీపీ నేతలు మాత్రం తమ అధినేత నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నారు. రాజ్యంగాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న  ఆగడాలను ప్రజలకు వివరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ చెబుతున్నారు. ఈ విషయంలో తమకు టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్ టీ రామారావే స్పూర్తి అంటున్నారు.


అసెంబ్లీ బహిష్కరణ వైసీపీ సొంత నిర్ణయమని ..ఇందులో తమ నాయకుడి పేరును ప్రస్తావించడమేమిటని పలువురు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి సచివాలయం ముందు కటిక నేలపై పడుకున్న చరిత్ర తమనేతదంటూ గుర్తు చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని అటు కాంగ్రెస్ కూడా తప్పుబట్టింది. సభలో ఏం చర్చించాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నారా ? అంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఘాటుగా ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డిని కాదని ఎన్టీఆర్ ను  ఎలా  ఆదర్శంగా తీసుకున్నారంటూ విమర్శలు గుప్పించారు.


ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని .. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న వైసీపీ నేతలు ఈ విషయంలో కూడా కాస్త మథన పడుతున్నట్టు సమాచారం. చేజేతులా వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్నామని కొందరు ఆవేదన చెందుతుంటే ... అధినేత నిర్ణయాన్ని పాటించడం తప్ప తామేమీ చేయలేమని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: