మరో నెలరోజుల్లో తెలంగాణలో మరో అద్భుతం సాకారం..!

siri Madhukar
హైదరాబాద్ మెట్రోతో భాగ్యనగరవాసుల ఎదురుతెన్నులు ముగిశాయి. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చేయడం ఓ బిగ్ రిలీఫ్. ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి చాలా వరకూ కష్టాలు తొలగిపోయినట్టే.. దీని కోసం హైదరాబాదీలు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. ఇప్పుడు మరో నెలరోజుల్లో ఇలాంటి మరో అద్భుతం సాకారం కాబోతోంది. అదే మిషన్ భగీరథ. దీని ద్వారా తెలంగాణ అంతటా ప్రతి ఇంటికీ తాగు నీరు నల్లా ద్వారా లభించబోతోంది. 


ఇప్పటికే మిషన్ భగీరథ పనులు 90 శాతం పూర్తయ్యాయట. ఇంకో పది శాతం మాత్రమే మిగిలి ఉన్నాయట. తెలంగాణలోని అన్ని ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రధాన పనులు దాదాపు పూర్తయ్యాయని మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షులు వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. మిగిలిన పదిశాతం పనులను ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ఆర్‌ డబ్ల్యూఎస్, ఎస్ విభాగం సమగ్ర కార్యాచరణ రూపొందించుకుంది ఆయన వివరించారు. 


కీలకమైన మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రశాంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమీక్షకు అన్ని జిల్లాల ఎస్‌ఈ, ఈఈ, డీఈలతో పాటు వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. సెగ్మెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పనుల పురోగతిని ప్రశాంత్‌ రెడ్డి సమీక్షించారు. సాగు, తాగునీటి రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకే సీఎం కేసీఆర్ ప్రతిక్షణం పనిచేస్తున్నారని వేముల అన్నారు. 


ఏ ఆడబిడ్డ కూడా ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు రావొద్దన్న సంకల్పంతో మిషన్ భగీరథను మొదలు పెట్టారని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. భగీరథ ఇంజనీర్లు, అధికారులతో పాటు వర్క్ ఏజెన్సీలు పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమించడంతోనే ప్రాజెక్టు పనులు ఊహించని స్థాయిలో జరిగాయని ప్రశంసించారు ప్రశాంత్ రెడ్డి. ఇంకో నెల రోజుల పాటు ఇదే స్పూర్తిని కొనసాగిస్తే మిషన్ భగీరథ మరో మైలురాయిని అందుకుంటామని అన్నారు. ఎక్కడైతే మోటార్లు బిగించడం పూర్తైందో అక్కడ వెంటనే ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: