చంద్ర‌బాబుకి కేవీపీ లేఖ‌..అందుకేనా..!

siri Madhukar
గత కొన్ని రోజులుగా ఏపీలో పోలవరం పై రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.  ఓ వైపు కేంద్రం పోలవరం పై ఆంక్షలు విధిస్తుంటే..ఏపీ సీఎం మాత్రం ప్రాజెక్టు కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు.  ఇక  పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అంటున్న విషయం తెలిసిందే. అయితే  పోలవరం అంశం ఎన్నో అనుమానాలకు తావిస్తున‍్నదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరంపై హైకోర్టులో తాను దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

విభజన సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్ట్ మొత్తాన్ని తామే నిర్మించి ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏపీ ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన అనేక షరతులను ఒప్పుకొంటూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మీ చేతులలలోకి తీసుకొని.. అంచనాలను కేంద్ర అనుమతి లేకుండా, మీకు నచ్చిన రీతిలో పెంచుకొంటూ.. ప్రాజెక్ట్ ను ఈరోజు గందరగోళ పరిస్థికి తెచ్చారని కేవీపీ విమ‌ర్శించారు.

 కేంద్రం తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన మీరు కేంద్రం అడుగులకు మడుగులొత్తడం చూస్తుంటే మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనుకాడడంలేదని స్పష్టమవుతోందని చంద్రబాబుపై కేవీపీ ధ్వజమెత్తారు.  ఏపీ ప్ర‌భుత్వం పోలవరం నిధుల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వంతో రహస్య ఒప్పందాలు చేసుకొంటే.. రాష్ట్ర ప్రజలు క్షమించరని కేవీపీ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: